
పోలవరం ప్రాజెక్టు అంశంపై ఈ శుక్రవారం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(NGT) లో విచారణ జరిగింది. ప్రాజెక్టు కు సంబంధించిన డంపింగ్ వ్యర్ధాలను ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారని పెంటపాటి పుల్లారావు అనే వ్యక్తి NGTలో పిటిషన్ దాఖలు చేశారు. కనీస ముందస్తు చర్యలు, పునరావాస చర్యలు, పర్యావరణ పరిరక్షణకు నియమ నిబంధనలు పాటించకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని న్యాయవాది శ్రవణ్ కుమార్ కోర్టులో తన వాదనలు వినిపించారు.
దీనిపై స్పందించిన NGT.. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘనకు గురవుతుంటే ఎందుకు పట్టించుకోలేదని కేంద్ర పర్యావరణ శాఖ తరఫు న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎవరు పర్యవేక్షిస్తున్నారని ప్రశ్నించగా.. ‘ పోలవరం ప్రాజెక్టు అథారిటీ ‘ ఆ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తుందని లాయర్ తెలిపారు. ఈ పిటీషన్ పై తదుపరి విచారణకు ‘ పోలవరం ప్రాజెక్టు అధారిటీ సిఈఓ’ హాజరు కావాలని జస్టిస్ ఏకే గోయల్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ నవంబర్ 7 వాయిదా వేసింది. పొంగులేటి సుధాకర్ రెడ్డి కేసులోనూ వరద ముంపు ప్రధాన అంశంగా ఉందని,పోలవరం డంపింగ్ కేసుతోనే వరద ముంపు పిటీషన్ ను విచారణ జరుపుతామని ఎన్జీటీ తెలిపింది.