ఏపీ ప్రభుత్వానికి నేషనల్‌‌‌‌ గ్రీన్‌‌‌‌ ట్రిబ్యునల్‌‌‌‌ షాక్‌‌‌‌

ఏపీ ప్రభుత్వానికి నేషనల్‌‌‌‌ గ్రీన్‌‌‌‌ ట్రిబ్యునల్‌‌‌‌ షాక్‌‌‌‌
  • ‘పోలవరం’లో అతిక్రమణలకు రూ.120 కోట్ల జరిమానా
  • పట్టిసీమ, పురుషోత్తపట్నం, చింతలపూడికి కలిపి రూ.123 కోట్ల ఫైన్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఏపీ ప్రభుత్వానికి నేషనల్‌‌‌‌ గ్రీన్‌‌‌‌ ట్రిబ్యునల్‌‌‌‌ షాక్‌‌‌‌ ఇచ్చింది. వివిధ ప్రాజెక్టుల నిర్మాణంలో ఉద్దేశపూర్వకంగా పర్యావరణ రూల్స్​ ఫాలో కాలేదంటూ రూ.243.09 కోట్ల జరిమానా విధించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అతిక్రమణకు రూ.120 కోట్ల ఫైన్​ చెల్లించాలని ఆదేశించింది. పోలవరం కుడి కాలువ విస్తరణ ద్వారా చేపట్టిన గోదావరి–కృష్ణా–పెన్నా లింక్‌‌‌‌ ప్రాజెక్టును నిలిపివేయాలని తేల్చిచెప్పింది. అన్ని పర్మిషన్‌‌‌‌లు తీసుకున్న తర్వాతే ఆ పనులు చేపట్టాలని ఎన్‌‌‌‌జీటీ ప్రిన్సిపల్‌‌‌‌ బెంచ్‌‌‌‌ ఆదేశించింది. పట్టిసీమ, పురుషోత్తపట్నం, చింతలపూడి ఎత్తిపోతల పథకాల్లో పర్యావరణ రూల్స్ పట్టించుకోనందుకు రూ.123 కోట్లు జరిమానా కట్టాలని చెప్పింది. పోలవరం ప్రాజెక్టులో పర్యావరణ రూల్స్‌ పట్టించుకోకపోవడం, అనుమతి లేకుండా గోదావరి–కృష్ణా–పెన్నా లింక్‌‌‌‌ ప్రాజెక్టులు చేపట్టడంపై మాజీ ఎమ్మెల్యే వట్టి వసంత కుమార్‌‌‌‌, పెంటపాటి పుల్లారావు, జమ్ముల చౌదరయ్య, మడిచర్ల సత్యనారాయణ తదితరులు ఎన్జీటీలో పిటిషన్లు దాఖలు చేశారు. వాటిని గురువారం ప్రిన్సిపల్‌‌‌‌ బెంచ్‌‌‌‌ చైర్‌‌‌‌ పర్సన్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ ఆదర్శ్‌‌‌‌ కుమార్‌‌‌‌ గోయల్‌‌‌‌, జ్యుడీషియల్‌‌‌‌ మెంబర్లు జస్టిస్‌‌‌‌ సుధీర్‌‌‌‌ అగర్వాల్‌‌‌‌, జస్టిస్‌‌‌‌ బ్రిజేశ్‌‌‌‌ సేథి, ఎక్స్‌‌‌‌పర్ట్‌‌‌‌ మెంబర్‌‌‌‌ నగిన్‌‌‌‌ నందాలతో కూడిన ధర్మాసనం విచారించింది. రూల్స్‌ పాటించలేదని తేల్చింది. ఫైన్‌ మొత్తాన్ని 3 నెలల్లోగా ఏపీ పొల్యూషన్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ బోర్డుకు చెల్లించాలని బెంచ్ సభ్యులు సూచించారు.

పర్మిషన్లు రాకుంటే ఆపేయండి
చింతలపూడి ఎత్తిపోతల పథకానికి 3నెలల్లోగా పర్మిషన్‌‌‌‌లు తెచ్చుకోవాలని, ఒకవేళ అనుమతులు రాకపోతే ప్రాజెక్టు పనులు 3నెలల తర్వాత ఆపేయాలని ఆదేశించారు. పోలవరం కుడి కాలువను విస్తరించి ప్రకాశం బ్యారేజీ మీదుగా బానకచర్ల క్రాస్‌‌‌‌ రెగ్యులేటర్‌‌‌‌ నుంచి చేపడుతున్న గోదావరి–కృష్ణా–పెన్నా నదుల లింక్ ప్రాజెక్టు పనులు ఆపేయాలని తేల్చిచెప్పారు.