17న జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండావిష్కరణ

17న జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండావిష్కరణ

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా ఈ నెల 16న రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ర్యాలీలు చేపట్టాలని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు.  దాదాపు 15,000 మంది ర్యాలీల్లో పాల్గొనేలా చూడాలని ఆధికారులను ఆదేశించారు. ఈ నెల18వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన బీఆర్‌‌కే భవన్‌‌లో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి జిల్లాకు 10,000 జాతీయ జెండాలను సప్లై చేయాలని సీఎస్ చెప్పారు. అందులో 50 పెద్ద జెండాలు ఉండాలని సూచించారు.

కార్యక్రమాల నిర్వహణ, పర్యవేక్షణ కోసం ప్రతి  నియోజకవర్గానికి ఓ సీనియర్ అధికారిని నోడల్ అధికారిగా నామినేట్ చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 17న అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ప్రజా ప్రతినిధులతో జాతీయ జెండాను ఎగరవేయించాలన్నారు. హైదరాబాద్‌‌లోని పబ్లిక్ గార్డెన్స్​లో సీఎం కేసీఆర్ జాతీయ జెండా ఆవిష్కరిస్తారని చెప్పారు. ఆ తర్వాత కొమ్రంభీమ్ ఆదివాసీ భవనం, సంత్ సేవాలాల్ బంజారా భవనాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారని సీఎస్ పేర్కొన్నారు. డీజీపీ మహేందర్‌‌రెడ్డి, జిల్లా కలెక్టర్లు సమావేశంలో పాల్గొన్నారు.