- ఆసక్తి చూపించని జాతీయ స్థాయి విద్యాసంస్థలు
- ప్రైవేటు వర్సిటీలకు కేవలం 11 అప్లికేషన్లే
- వాటిలో ఎక్కువ తెలంగాణ కాలేజీలే
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు జాతీయస్థాయి విద్యాసంస్థలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అప్లికేషన్ప్రాసెస్ స్టార్ట్ అయి ఐదు నెలలు అవుతున్నా, కేవలం 11 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. అయితే మిడిలాఫ్ ఇయర్ నోటిఫికేషన్ కావడంతో, ఈ ఏడాది వేచిచూసే ధోరణిలో ప్రైవేటు మేనేజ్మెంట్లు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. మరోపక్క వచ్చిన అప్లికేషన్స్పరిశీలన వేగంగానే సాగుతోంది. నెలరోజుల్లోపు పూర్తిచేసి మేనేజ్మెంట్లకు వర్సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చే కసరత్తు జరుగుతోంది.
రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలను అనుమతిస్తూ ‘తెలంగాణ రాష్ట్ర ప్రైవేటు యూనివర్సిటీల చట్టం–2018’ను ప్రభుత్వం తీసుకొచ్చింది. దీన్ని అమల్లోకి తీసుకొస్తూ ఈ ఏడాది ఆగస్టులో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రైవేటు యూనివర్సిటీల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో మంచి పేరున్న ప్రైవేటు విద్యాసంస్థలు, యూనివర్సిటీలు, డీమ్డ్ వర్సిటీలు వస్తాయని ప్రభుత్వం భావించింది. కానీ తొలిఏడాది సర్కారు ఆశలకు గండిపడినట్టైంది. ఇప్పటి వరకూ కేవలం 11 సంస్థలే దరఖాస్తు చేసుకున్నాయి. వాటిలో టెక్ మహీంద్ర, వాక్సన్, శ్రీనిధి, మల్లారెడ్డి, ఎస్ఆర్, అమిటీ, అనురాగ్, గురునానక్, నిక్మార్, రాడ్‌క్లిఫ్, ఎంఎన్ఆర్ సంస్థలున్నట్టు అధికారులు చెప్తున్నారు. అయితే వీటిలో సగానికంటే ఎక్కువ, తెలంగాణలోని ప్రైవేటు కాలేజీలే కావడం గమనార్హం. మిగిలిన వాటిలోనూ ఒకటి, రెండు సంస్థలు మినహా అన్నీ రాష్ట్రంలో ఇన్స్టిట్యూషన్స్నడుపుతున్నాయి. అప్లికేషన్స్ పెట్టుకున్న అన్ని సంస్థల ప్రజెంటేషన్ ఇప్పటికేపూర్తయింది. వాటిలో ఎనిమిది సంస్థలను విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి చైర్మన్‌గా ఉన్న ఎక్స్‌పక్ట్ కమిటీ పరిశీలించింది. ఈ వారంలో మిగిలిన సంస్థలనూ పరిశీలించనుంది. ఆ తర్వాతి 60 రోజుల్లోనే కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందించనున్నది. దీని ఆధారంగా 30 రోజుల్లో ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించనున్నది. ఎక్స్ పర్ట్ కమిటీ సాధ్యమైనంత త్వరగా సర్కారుకు నివేదిక పంపిచే యోచనలో ఉంది.
వేచిచూసే ధోరణిలో పెద్ద సంస్థలు
వర్సిటీ పెట్టాలంటే హెచ్ఎండీఏ పరిధిలో 20 ఎకరాలు, ఇతర ప్రాంతాల్లో 30 ఎకరాల స్థలం ఉండాలి. ఎండోమెంట్ ఫండ్ రూ.10కోట్లు, కార్పస్‌ఫండ్ రూ.30 కోట్లు చూపించాల్సి ఉంది. మేనేజ్మెంట్లు వర్సిటీ ఏర్పాటుకు వసతులు, ఇతర అవసరాల కోసం కనీసం రూ.200 కోట్లకు పైగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇంత ఖర్చు చేస్తే, భవిష్యత్‌లో అవి మంచిగా నడుస్తాయా లేదా అనే ఆలోచనలో మేనేజ్మెంట్లున్నాయి. కొన్ని సంస్థలు తెలంగాణలో ఏ కోర్సులకు ఎక్కువ డిమాండ్ ఉంది..? ఎలాంటి స్పెషలైజేషన్స్పెడితే వర్సిటీలు నడుస్తాయి అనే సర్వేలు నిర్వహిస్తున్నాయి.
మరోపక్క ప్రైవేటు యూనివర్సిటీలపై ప్రభుత్వ ఆలోచననూ మేనేజ్మెంట్లు పరిశీలిస్తున్నాయి. నిబంధనలు కఠినంగా అమలు చేస్తే, పెద్దగా వర్సిటీలు పెట్టేందుకు ముందుకు రాకపోవచ్చని అధికారులు చెప్తున్నారు. సర్కారు వ్యవహరించే తీరుతోనే ప్రైవేటు యూనివర్సిటీల రాకపై క్లారిటీ వచ్చే అవకాశముంది. అయితే తెలంగాణలో విద్యార్థి, ప్రజాసంఘాలు ప్రైవేటు వర్సిటీల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు.
ఫస్ట్ ఇయర్ కాబట్టే..
ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు అనుమతించింది ఇదే ఏడాది కావడంతో దరఖాస్తులు ఎక్కువగా రాలేదు. నెక్ట్స్ అకడమిక్ఇయర్ వర్సిటీని ప్రారంభించాలనుకునే వాళ్లు అప్లై చేసుకున్నారు. భవిష్యత్‌లో మరిన్ని సంస్థలు వర్సిటీలు పెట్టేందుకు ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకూ వచ్చిన అప్లికేషన్లపై ప్రాసెస్ కొనసాగుతోంది. ఎక్స్‌పర్ట్ కమిటీ వర్సిటీకి ఉన్న వసతులు, నిబంధనలను పరిశీలించి ప్రభుత్వానికి రిపోర్టు ఇస్తుంది. ప్రభుత్వం ఆ తర్వాత ఎవరికి అనుమతి ఇవ్వాలి..? ఇవ్వరికి ఇవ్వొద్దు అనేది ప్రకటించిస్తుంది.- తుమ్మల పాపిరెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్

