
- ప్రెసిడెంట్ పదవి వద్దంటున్న రాహుల్..
- త్వరలో తాత్కాలిక చీఫ్ నియామకం?
- అమిత్ షా వారసుడెవరు ?
- 13,14 తేదీల్లో బీజేపీ హై లెవల్ మీటింగ్
ఒకటేమో 134 ఏండ్ల గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్. ఇంకోటేమో వరుసగా రెండోసారి కేంద్రంలో అధికారాని కొచ్చిన బీజేపీ. ఈ రెండు పార్టీలూ కొత్త బాస్ కోసం గాలింపు ముమ్మరం చేశాయి. బీజేపీ చీఫ్ అమిత్ షా కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకోవడంతో పార్టీకి కొత్త నాయకుని అవసరమొచ్చింది. ఈ నెల 13, 14న జరగబోయే హైలెవల్ మీటింగ్‌లో షా వారసుడు డిసైడయ్యే చాన్సుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. రాహుల్ గాంధీ రాజీనామా నిర్ణయానికే కట్టుబడటంతో కాంగ్రెస్‌కూ కొత్త లీడర్‌ను వెతుక్కోక తప్పడంలేదు. రాహుల్ పట్టుబడుతున్నట్టుగా నెహ్రూ కుటుంబానికి చెందని వ్యక్తిని కాంగ్రెస్ తాత్కాలిక చీఫ్‌గా ఒకట్రెండు రోజుల్లోనే ప్రకటించే అవకాశాలున్నట్లు ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.
షా తర్వాత ఎవరు?
న్యూఢిల్లీ: బీజేపీ ప్రెసిడెంట్ అమిత్ షా కేంద్ర హోంమంత్రి కావడంతో ఆయన స్థానం భర్తీ ప్రక్రియ మొదలైంది. పార్టీ చీఫ్ రేసులో కేంద్ర మాజీ మంత్రి జయప్రకాశ్ నడ్డా, రాజ్యసభ సభ్యుడు భూపీందర్ యాదవ్ ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త ప్రెసిడెంట్ ను ఎన్నుకునేందుకు గురు, శుక్రవారాల్లో ఉన్నతస్థాయి సమావేశం జరగనున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. అన్ని రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉందని, తర్వాత కొత్త ప్రెసిడెంట్ ను ఎన్నుకుంటారని సమాచారం. సమావేశానికి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన పార్టీ చీఫ్ లు, జనరల్ సెక్రటరీలు హాజరు కానున్నారు. ఈ నెల 13న పార్టీ పదాధికారులతో వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో అమిత్ షా భేటీ కానున్నారు.
బీజేపీ ప్రెసిడెంట్ గా షా మూడేళ్ల పదవీకాలం జనవరిలోనే ముగిసింది. లోక్ సభ ఎన్నికలు ఉన్నందున ఆయన పదవీకాలాన్ని పార్టీ పొడిగించింది. రాజ్ నాథ్ సింగ్ తర్వాత పార్టీ చీఫ్ బాధ్యతలు చేపట్టిన అమిత్ షా వరుసగా రెండు టెర్మ్ లు సేవలందించారు. సగానికిపైగా రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు పూర్తయిన తర్వాతే పార్టీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవాలని పార్టీ రాజ్యాంగం చెబుతోంది. హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున ప్రస్తుతం పార్టీలో పెద్ద మార్పులేమీ జరగకపోవచ్చని బీజేపీ సీనియర్ నేత ఒకరు అన్నారు. జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటే ముందుగా సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాలి. దానికి డెడ్ లైన్ ఫిక్స్ చేసేందుకు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. రాష్ట్ర స్థాయిలో ఎన్నికలు పూర్తయిన వెంటనే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతుందన్నారు.
కాంగ్రెస్‌కు తాత్కాలిక చీఫ్?
న్యూఢిల్లీ: తాత్కాలిక ప్రెసిడెంట్‌ను నియమించే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కేవలం 52 ఎంపీ సీట్లు మాత్రమే దక్కడంతో .. ఓటమికి బాధ్యత వహిస్తూ పార్టీ చీఫ్ పదవికి రాజీనామాచేస్తున్నట్టు రాహుల్‌గాంధీ ప్రకటించారు. పార్లమెంటరీ పార్టీ ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకించడంతో ప్రస్తుతం ఈ అంశం పెండింగ్‌లో పడింది. నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందని నాయకుడే పార్టీ పగ్గాలు చేపట్టాలని రాహుల్ గట్టిగా కోరుతున్నారు. పార్టీలో కొనసాగుతున్న ఈ ప్రతిష్టంభనను తొలగించేందుకు సీనియర్లు రంగంలోకి దిగినట్టు తెలిసింది. ఈమేరకు పార్టీ సీనియర్ నేత ఎ.కె. ఆంటోనీ త్వరలోనే రాహుల్‌గాంధీతో సమావేశమవుతారని తెలుస్తోంది. రాజీనామా నిర్ణయంపై మరోసారి ఆలోచించుకోవాలని రాహుల్‌కు సీనియర్లు చేసిన విజ్ఞప్తి పెద్దగా ఫలించలేదని చెబుతున్నారు.
ప్రెసిడెంట్ పదవిలో కొనసాగాలని చాలా రాష్ట్రాల కాంగ్రెస్ చీఫ్‌లు రాహుల్‌కు విజ్ఞప్తి చేశారు. అయినా ఆయన ససేమిరా అనడంతో..కొత్త మార్గాలను వెదికే పనిలో సీనియర్లు పడ్డారు. దీంట్లో భాగంగా సీనియర్ నాయకుణ్ని తాత్కాలికంగా ప్రెసిడెంట్‌గా ఎంపిక చేసేందుకు పార్టీలో ముమ్మరంగా కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతోపాటు లోక్‌సభలో కాంగ్రెస్‌ను ఎవరు లీడ్ చేస్తారన్న విషయం మరో వారం రోజుల్లో తేలిపోనుందని తెలుస్తోంది.
రాహుల్‌గాంధీపై మరో ఒత్తిడి కూడా వస్తోంది. లోక్‌సభలో పార్టీకి నాయకత్వం వహించాలని ఆయనపై ప్రెషర్ తీసుకొస్తున్నారు. ఈనెల 17 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 16వ లోక్‌సభలో పార్టీ నాయకుడిగా ఉన్న ఖర్గే ఈ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయన స్థానంలో కొత్త నాయకుణ్ని ఎన్నుకోవాల్సి ఉంది. గత నెల 25న జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో అధ్యక్షపదవి నుంచి తప్పుకోవాలన్న నిర్ణయాన్ని ప్రకటించినప్పటి నుంచి రాహుల్‌ని కలవడానికి సీనియర్ నేతలు ప్రయత్నిస్తున్నా…వాళ్లకు ఆయన అపాయింట్‌మెంట్ ఇవ్వడంలేదు.