8 జాతీయ పార్టీల ఆస్తులు రూ.8 వేల కోట్లుపైనే.. ఇది కదా సంపాదన అంటే

8 జాతీయ పార్టీల ఆస్తులు రూ.8 వేల కోట్లుపైనే.. ఇది కదా సంపాదన అంటే
  • ఏడాదిలో భారీగా పెరిగినట్లు ఏడీఆర్ రిపోర్టులో వెల్లడి.. 
  • బీజేపీకి 6,046.81 కోట్లు, కాంగ్రెస్‌‌కు 805.68 కోట్ల ఆస్తులు

న్యూఢిల్లీ: జాతీయ పార్టీల ఆస్తులు భారీగా పెరిగాయి. 2021-–22లో దేశంలోని 8 పార్టీలకు ఉన్న అసెట్స్‌‌ రూ.8,829 కోట్లు అని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్‌‌(ఏడీఎం) తన రిపోర్టులో వెల్లడించింది. 8 నేషనల్ పార్టీలకు 2020–21లో రూ.7,297.62 కోట్లు ఉండగా.. ఏడాదిలోనే రూ.1,532 కోట్లకు పైగా పెరిగినట్లు తెలిపింది. 2020-–21, 2021-–22లో బీజేపీ, కాంగ్రెస్, ఎన్సీపీ, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, ఏఐటీసీ, ఎన్‌‌పీఈపీ ప్రకటించిన ఆస్తులు, అప్పులను విశ్లేషించి ఈ రిపోర్టును విడుదల చేసింది. 2020–21లో బీజేపీ ప్రకటించిన ఆస్తులు రూ.4,990 కోట్లు కాగా, 2021–22లో 21% పెరిగి 6,046.81 కోట్లకు చేరుకున్నాయి. 

2020–-21లో కాంగ్రెస్‌‌ ఆస్తులు రూ.691.11 కోట్లు కాగా, 2021–-22లో 16.58% పెరిగి 805.68 కోట్లకు చేరుకున్నాయి. బీఎస్పీ ఆస్తులు మాత్రం తగ్గాయి. 2020-–21లో బీఎస్పీకి రూ. 732.79 కోట్లు ఉండగా.. 2021–-22లో 5.74% తగ్గి 690.71 కోట్లకు పడిపోయాయి. ఇక టీఎంసీ ఆస్తులు మాత్రం ఏకంగా 150 శాతానికి పైగా పెరిగాయి. 2020–-21లో రూ.182 కోట్లు ఉండగా.. 2021-–22లో 458 కోట్లకు చేరాయి. ఇక 2021–22లో కాంగ్రెస్‌‌కు  రూ.41.95 కోట్లు, సీపీఎంకి 12.21 కోట్లు, బీజేపీకి 5.17 కోట్ల అప్పులు ఉన్నట్లు ఏడీఆర్ వెల్లడించింది. ఆ రెండేళ్లలో ఐదు పార్టీల అప్పులు తగ్గాయి.