బ్రిటీషర్లనే తరిమికొట్టినం..మీ దాడులకు బెదురుతమా : మల్లికార్జున ఖర్గే

బ్రిటీషర్లనే తరిమికొట్టినం..మీ దాడులకు బెదురుతమా : మల్లికార్జున ఖర్గే

బాలాఘాట్(ఎంపీ): కాంగ్రెస్ ​పార్టీ బ్రిటీషర్లనే తరిమికొట్టిందని, కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులకు భయపడబోమని ఆ పార్టీ ​జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. చత్తీస్‌‌గఢ్‌‌లో ఇటీవల కేంద్ర ఏజెన్సీలు జరిపిన దాడులు తమ కార్యకర్తలను నిరుత్సాహపరచలేదని, అక్కడి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఆయన మధ్యప్రదేశ్​లోని నక్సల్ ప్రభావిత బాలాఘాట్ జిల్లాలోని కటంగి పట్టణంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. 

ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. “నేను శుక్రవారం చత్తీస్‌‌గఢ్‌‌లో ఉన్నాను. మోదీ,  షాలు ఆ రాష్ట్రంపై ఫోకస్​ పెట్టారు. ఈడీ, సీబీఐ, ఐటీ దాడుల ద్వారా మా పార్టీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసి.. వాళ్లను ఇళ్లలోనే కూర్చోబెట్టాలనుకున్నారు. మా ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. దర్యాప్తు సంస్థలను ఆయుధంగా వాడుకుంటోంది” అని ఆరోపించారు. తాజాగా బెట్టింగ్​యాప్​ద్వారా చత్తీస్​గఢ్​కు నిధులు వచ్చాయని ఈడీ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఖర్గే ఇలా స్పందించారు.