మాచునూర్‌‌‌‌ సీడ్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌కు జాతీయ గుర్తింపు

మాచునూర్‌‌‌‌ సీడ్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌కు జాతీయ గుర్తింపు

సంగారెడ్డి, వెలుగు: విత్తన సంరక్షకులుగా గుర్తింపు తెచ్చుకున్న మాచునూర్‌‌‌‌ డెక్కన్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ సొసైటీ (డీడీఎస్‌‌‌‌) మహిళా రైతుల కృషికి తగిన ఫలితం దక్కింది. సేంద్రియ విధానంలో సొంతంగా విత్తనాలను తయారు చేయడమే కాకుండా, వాటి కోసం కమ్యూనిటీ బ్యాంక్‌‌‌‌ను ఏర్పాటు చేసి చిరుధాన్యాలను పరిచయం చేస్తున్న డీడీఎస్‌‌‌‌ ప్లాంట్‌‌‌‌ జీనోమ్‌‌‌‌ సేవియర్‌‌‌‌ జాతీయ అవార్డుకు ఎంపికైంది.

భారత ప్రభుత్వ వ్యవసాయ శాఖ 2022– -23 ఏడాదికిగానూ డీడీఎస్‌‌‌‌కు అవార్డును ప్రకటించింది. దీంతో డీడీఎస్‌‌‌‌ మహిళా ప్రతినిధులు ఈ నెల 12న ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌‌‌‌సింగ్‌‌‌‌ చవాన్‌‌‌‌ చేతుల మీదుగా అవార్డును అందుకోనున్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ ప్రొటెక్షన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ప్లాంట్‌‌‌‌ వెరైటీస్ అండ్ ఫార్మర్‌‌‌‌ రైట్స్ (పీపీవీఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌ఏ) ద్వారా డీడీఎస్‌‌‌‌కు గుర్తింపు లభించింది. 40 దశాబ్దాలుగా చేస్తున్న కృషికి అవార్డు దక్కడం పట్ల డీడీఎస్‌‌‌‌ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రెండు వేల మంది సభ్యులతో...
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం పస్తాపూర్ గ్రామానికి చెందిన డీడీఎస్‌‌‌‌ మహిళా రైతులు ఝరాసంఘం మండలం మాచునూర్‌‌‌‌ కేంద్రంగా చిరుధాన్యాల సీడ్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ నిర్వహిస్తున్నారు. ఇందులో జహీరాబాద్, కోహిర్, న్యాల్కల్, మొగుడంపల్లి, రాయికోడ్, ఝరాసంఘం మండలాలకు చెందిన సుమారు రెండు వేల మంది సభ్యులుగా కొనసాగుతున్నారు. 

అందుబాటులో 65 రకాల విత్తనాలు
మాచనూర్‌‌‌‌ డెక్కన్‌‌‌‌ సొసైటీ సభ్యులు తమ సెంటర్‌‌‌‌లో సుమారు 65 రకాల విత్తనాలను భద్రపరుస్తున్నారు. ఇందులో సజ్జ, సామలు, కొర్ర, కొర్రసామ, తైదలు, శనగలు, జొన్న, మొక్కజొన్న, సాయి జొన్న, పచ్చ జొన్న, తీపి జొన్న, గుండు జొన్న, తోక జొన్న, పెసర, మినుము, అవిశ, కందులతో పాటు పలు రకాల విత్తనాలు అందుబాటులో ఉంచుతున్నారు. విత్తనాలకు పురుగు  పట్టకుండా బూడిద, వేపాకు కలిపి ఈత బుట్టల్లో పోసి మట్టితో కప్పేస్తారు. విత్తనాలు వేసే టైం రాగానే వీటిని బయటకు తీసి అవసరం మేరకు చుట్టుపక్కల గ్రామాల్లోని డీడీఎస్‌‌‌‌ సభ్యులతో పాటు ఇతర రైతులకు సైతం పంపిణీ చేస్తుంటారు. విత్తనాలు తీసుకున్న రైతులు.. పంట చేతికి రాగానే నాణ్యమైన పంటను విత్తనంగా తిరిగి ఇదే సెంటర్‌‌‌‌కు అందజేస్తారు.

సొంతంగా విత్తనాలు 
సేంద్రియ పంటల కోసం సొంతంగా విత్తనాలు తయారు చేసుకుంటున్నాం. గత 40 ఏండ్లుగా చిరుధాన్యాలు పండిస్తున్నాం. పంటను పండించడమే కాకుండా విత్తనాలు తయారు చేసి, వాటిని భద్రపరిచి అందరికీ పంచుతున్నాం. ఇన్నాళ్లుగా చేస్తున్న కృషికి తగిన ఫలితం దక్కింది. గ్రామస్థాయిలో ఉన్న మాకు ఢిల్లీ స్థాయిలో అవార్డు రావడం గర్వంగా ఉంది.  లక్ష్మమ్మ, డీడీఎస్‌‌‌‌ సభ్యురాలు

అవార్డు రావడం సంతోషంగా ఉంది 
అవార్డు రావడం సంతోషంగా ఉంది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చిరుధాన్యాలను పండిస్తున్నాం. సేంద్రియ ఎరువులతో పండించిన పంటను నలుగురికి పరిచయం చేస్తూ ప్రోత్సహిస్తున్నాం. చేసిన కృషికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇవ్వడం పట్ల డీడీఎస్‌‌‌‌ సభ్యులుగా గర్వపడుతున్నాం.

మొగులమ్మ, విత్తన నిర్వాహకురాలు