జనవరి 31 వరకు జాతీయ ‘రోడ్డు భద్రతా మాసోత్సవాలు’ : మంత్రి పొన్నం ప్రభాకర్

జనవరి  31 వరకు జాతీయ ‘రోడ్డు భద్రతా మాసోత్సవాలు’ : మంత్రి పొన్నం ప్రభాకర్
  •     రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

యాదగిరిగుట్ట, వెలుగు: ఈ నెల 1 నుంచి 31 వరకు నెల రోజుల పాటు ‘జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు’ నిర్వహించనున్నట్లు తెలిపారు. గురువారం యాదగిరిగుట్టలో స్వామివారి దర్శనం అనంతరం రోడ్డు భద్రతా మాసోత్సవాలకు సంబంధించిన పోస్టర్ ను ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్యతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు ప్రతి పౌరుడు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా నిర్వహించే అవగాహన సదస్సుల్లో పాల్గొనాలని సూచించారు. 

విద్యాశాఖతో సమన్వయం చేసుకుని 'సిగ్నేచర్ క్యాంపైన్' నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తామని విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అఫిడవిట్ తీసుకునే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇకపై భవిష్యత్తులో రోడ్డు సేఫ్టీ పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండేందుకు రాష్ట్రంలోని ప్రతి పాఠశాలను ‘రోడ్డు సేఫ్టీ క్లబ్ మెంబర్ షిప్’ చేస్తామని చెప్పారు. 

రోడ్డు ప్రమాదాలను నివారించి పౌరుల మరణాల సంఖ్యను తగ్గించడం కోసమే ఏటా జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ హనుమంతరావు, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ వాణి, డీటీవో సాయికృష్ణ, ఆర్డీవో కృష్ణారెడ్డి, ఆర్టీఏ మెంబర్ ఆకుల నరసింహ, ఎంవీఐలు శ్రీకాంత్, ఆనంద్, షేక్ ఇమ్రాన్ అహ్మద్, యాదగిరిగుట్ట మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, మాజీ ఉప సర్పంచ్ భరత్ గౌడ్ తదితరులు ఉన్నారు.