నేషనల్ శాంపిల్ సర్వే : పల్లె, పట్టణాల్లో బీసీలకే అధికంగా ఖర్చులు.. తిండిపై ఖర్చు తక్కువే

నేషనల్ శాంపిల్ సర్వే : పల్లె, పట్టణాల్లో బీసీలకే అధికంగా ఖర్చులు.. తిండిపై ఖర్చు తక్కువే

తెలంగాణలో ప్రజల ఖర్చులు భారీగా పెరిగాయి. నెలవారీ తలసరి ఖర్చులు (ఎంపీసీఈ) దేశ సగటుతో పోలిస్తే  తెలంగాణలోనే అధికంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఖర్చులు గత పదేండ్లలో రెట్టింపు అయ్యాయి. వివిధ రాష్ట్రాలతో పోల్చి చూస్తే, తలసరి ఖర్చుల్లో మన రాష్ట్రం దేశంలో ఐదో స్థానంలో ఉంది. నేషనల్​ శాంపిల్​సర్వే ఆఫీస్​(ఎన్ఎస్ఎస్​వో) చేసిన కుటుంబ ఖర్చుల సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 

వివిధ సామాజికవర్గాల వారీగానూ ఖర్చుల వివరాలపై ఎన్ఎస్ఎస్​వో సర్వే చేసింది. అగ్రవర్ణాల వారిని పక్కనపెడితే.. బీసీలకు అధికంగా ఖర్చులవుతున్నట్టు తేల్చింది. పల్లెల్లోని బీసీలు ఒక్కొక్కరు నెలకు రూ.3,848, పట్టణాల్లో రూ.6,177 ఖర్చు పెడుతున్నట్టు పేర్కొంది. ఎస్టీలకు పల్లెల్లో రూ.3,016, పట్టణాల్లో రూ.5,414, ఇక ఎస్సీలకు పల్లెల్లో రూ.3,474, పట్టణాల్లో రూ.5,307 ఖర్చవుతున్నట్టు వెల్లడించింది. ఇతర వర్గాల వారిలో సగటున ఒక్కొక్కరిపై నెలకయ్యే ఖర్చు పల్లెల్లో అయితే రూ.4,392, పట్టణాల్లో రూ.7,333గా ఉన్నట్టు తేల్చింది.   

దేశంలో తిండిపై ప్రజలు తక్కువే ఖర్చు పెడుతున్నట్టు సర్వేలో వెల్లడైంది. పల్లెల్లో రూ.1,750.. పట్టణాల్లో రూ.2,530 ఖర్చు పెడుతున్నట్టు తేలింది. ఇతర అవసరాలపై పల్లెల్లో రూ.2,023.. పట్టణాల్లో రూ.3,929 మేర ఖర్చు పెడుతున్నట్టు వెల్లడైంది. మరోవైపు నిరుపేదవర్గాలకు సరైన ఆదాయం లేక ఖర్చులు కూడా తక్కువగా ఉన్నట్టు సర్వే పేర్కొంది. పల్లెల్లో అత్యంత నిరుపేదలు ఒక్కొక్కరిపై నెలకు రూ.1,373.. పట్టణాల్లో రూ.2,001 ఖర్చు అవుతున్నట్టు సర్వే వివరించింది. అయితే, పట్టణ ప్రాంతాల్లో ఉండే ధనికుల్లో ఒక్కొక్కరిపై సగటున రూ.20,824 ఖర్చవుతుండగా.. పల్లెల్లో రూ.10,501 ఖర్చు పెడుతున్నట్టు తేలింది.