
న్యూఢిల్లీ: రోజు రోజుకి స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు పెరుగుతున్నారు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) యూనిక్ యూజర్లు తొమ్మిది కోట్ల మార్క్‌ను దాటారు. గత ఐదు నెలల్లోనే కోటి మంది కొత్త ఇన్వెస్టర్లు మార్కెట్‌లో జాయిన్ అయ్యారు. ఎన్‌ఎస్‌ఈ దగ్గర రిజిస్టర్ అయిన మొత్తం క్లయింట్ కోడ్స్ 16.9 కోట్లకు చేరుకున్నాయి. ఇందులో యూనిక్ ఇన్వెస్టర్ల సంఖ్య ఐదు నెలల్లోనే ఎనిమిది కోట్ల నుంచి తొమ్మిది కోట్లకు పెరిగింది.
ఆరు కోట్ల నుంచి ఏడు కోట్లకు చేరుకోవడానికి తొమ్మిది నెలలు పట్టిందని ఎన్‌ఎస్‌ఈ ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. ‘ఇన్వెస్టర్లు గత ఐదేళ్లలో మూడు రెట్లకు పైగా పెరిగారు. డిజిటైజేషన్ వేగంగా విస్తరించడం, ఇన్వెస్టర్లలో అవగాహన పెరగడం, మార్కెట్ పెరుగుతుండడమే ఇందుకు కారణం’ అని తెలిపింది. ఎన్‌ఎస్‌ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ 4 ట్రిలియన్ డాలర్లను దాటిందని, ప్రపంచలోనే నాలుగో అతిపెద్ద మార్కెట్‌గా అవతరించామని కిందటేడాది డిసెంబర్‌లో ఎన్‌ఎస్‌ఈ పేర్కొంది. యూఎస్, చైనా, జపాన్ మార్కెట్‌లు టాప్‌లో ఉన్నాయి.