ఢిల్లీ : రికార్డు స్థాయిలో ధరల పెరుగుదల, నిరుద్యోగ అంశాలపై ఆగస్టు 5న దేశవ్యాప్త ఆందోళనలకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) పిలుపునిచ్చింది. ఈమేరకు కాంగ్రెస్ క్యాడర్ కు ఏఐసీసీ నిర్దేశాలు జారీ చేసింది. ఆ రోజున రాష్ట్రపతి భవన్ నుంచి రాజ్ భవన్ వరకు నిర్వహించనున్న ఆందోళన కార్యక్రమాలకు సంబంధించిన కార్యాచరణ ప్రకటించింది.
జిల్లాల స్థాయిలో..
జిల్లాల స్థాయిలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులందరూ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడంతో పాటు కలెక్టరేట్లు ముట్టడించాలని ఏఐసీసీ సూచించింది. రాష్ట్ర రాజధానుల్లో పీసీసీ ఆధ్వర్యంలో రాజ్ భవన్ ముట్టడించాలని తెలిపింది.
రాజ్ భవన్ ముట్టడిలో..
రాజ్ భవన్ ముట్టడిలో ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, సీనియర్ కాంగ్రెస్ నేతలు పాల్గొంటారని ఏఐసీసీ పేర్కొంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించే ‘చలో రాష్ట్రపతి భవన్’ కార్యక్రమంలో లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు పాల్గొంటారని ఏఐసీసీ వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటి ముట్టడి కార్యక్రమంలో సీడబ్ల్యూసీ సభ్యులు , జాతీయ కాంగ్రెస్ నాయకులు పాల్గొంటారని ప్రకటించింది.
