నల్లమల చుట్టూ చెంచులకంచె

నల్లమల చుట్టూ చెంచులకంచె
  • ఎలాగైనా అడవిని కాపాడుకుంటామని ప్రతిన
  • బృందాలుగా రోడ్లపైకి వచ్చి కాపలా
  •  అధికారులను అడ్డుకొని నిరసన

నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా చెంచులు, స్థానికులు ఏకమవుతున్నారు. తమ ప్రాణాలను ఫణంగా పెట్టయినా  అడవిని, తమ అస్థిత్వాన్ని కాపాడుకుంటామని ప్రతినబూనుతున్నారు. యువజన, కుల, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బృందాలుగా రోడ్లపైకి వచ్చి కాపలా కాస్తున్నారు. బోర్​వెల్స్​లారీలను, అటవీ అధికారుల వాహనాలను  అడవుల్లోకి వెళ్లకుండా తిప్పిపంపుతున్నారు. ఇన్నాళ్లూ నిరసనకే పరిమితమైన యురేనియం వ్యతిరేక పోరాటం, క్రమంగా ఉద్యమరూపం దాలుస్తుండడంతో అటవీ అధికారులు తలపట్టుకుంటున్నారు.

సర్వే అనుమతులపై  రాజుకుంటున్న అగ్గి..

నల్లమలలో యురేనియం నిక్షేపాలను గుర్తించేందుకు కేంద్రప్రభుత్వం సర్వేకు అనుమతించడంపై స్థానికంగా అగ్గి రాజుకుంటోంది.  కుంచోని మూల నుంచి పదర వరకు మొదటి బ్లాక్​లో 38 చదరపు కిలో మీటర్లు, పదర నుంచి ఉడిమిల్ల వరకు రెండో బ్లాకులో 38 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నాలుగు వేల బోర్లు వేసి,  నమూనాలు సేకరించేందుకు భారత అణుశక్తి సంస్థ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.ఈమేరకు అనుమతులు రావడంతో అచ్చంపేట, అమ్రాబాద్​ అటవీశాఖ  అధి కారులు, సిబ్బంది వారం రోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. డ్రిల్లింగ్​యంత్రాలు వచ్చేందుకు రూట్​మ్యాప్​ సిద్ధం చేస్తున్నారు.  యురేనియం సర్వే విషయం తెరపైకి రాగానే మేధావులు, ప్రజా సంఘాల నాయకులు, విపక్ష నేతలు రంగంలోకి దిగారు. నల్లమలలో ముమ్మరంగా పర్యటించి, యురేనియం తవ్వకాల వల్ల కలిగే దుష్పరిణామాలపై స్థానికులందరినీ చైతన్యపరిచారు. యువజన, కుల సంఘాల నాయకులతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు.

అడుగడుగునా ఆటంకాలు..

అడవిని, తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటామని ప్రతినబూనుతున్న స్థానికులు.. యువజన, కుల, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బృందాలుగా రోడ్లపైకి వచ్చి రాత్రింబవళ్లు కాపలా కాస్తున్నారు. ప్రధానంగా మన్ననూర్​ చెక్​ పోస్టుతోపాటు అమ్రాబాద్ మండల కేంద్రంలోనూ యురేనియం వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో అడ్డా వేస్తున్నారు. అటవీశాఖ ఇచ్చే నివేదికల ఆధారంగా యురేనియం సంస్థ అధికారులు సర్వేకు వస్తారనే సమాచారంతో అటవీశాఖ అధికారులను అడ్డగిస్తున్నారు. గురువారం మన్ననూర్​కు వచ్చిన చీఫ్​ కన్జర్వేటర్​, టైగర్​ రిజర్వ్​ ఫీల్డ్​ డైరెక్టర్​ ఎ.కె.సిన్హా వాహనాన్నీ అటకాయించారు. వెనక్కి తిరిగేంత వరకు ఉద్యమ కారులు వదలలేదు. అమ్రాబాద్​ డివిజన్​ ఆఫీస్​లో విధులు నిర్వహించే సబ్​ డివిజనల్​ ఫారెస్ట్​ అధికారిని అడ్డుకున్నారు. చీఫ్​ కన్జర్వేటర్​ ఏకే సిన్హా వాహనం వెనుక బోర్​ డ్రిల్లింగ్​ యంత్రం ఉండడంతో ఆయనే  తీసుకువస్తున్నారని అనుమానించి, రెండు వాహనాలనూ నిలిపివేశారు. అంతకుముందు రోజు బుధవారం వివిధ ప్రాంతాలకు చెందిన శివపారాయణ బృంద సభ్యులు 28 ఆర్టీసీ బస్సులలో శ్రీశైలానికి వెళుతుండగా అడ్డగించారు. పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే వెళ్లనిచ్చారు. మంగళవారం నల్గొండ జిల్లా దేవరకొండ ప్రాంతంలో అణు ఇంధన సంస్థ అధికారులను అడ్డుకున్నారు. యురేనియం తవ్వకాల పేరిట తమ అడవిని నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమనీ, అవసరమైతే ప్రాణత్యాగాలకైనా సిద్ధమేనని స్థానికులు హెచ్చరిస్తుండడంతో ఎలా ముందుకుపోవాలో తెలియని అటవీఅధికారులు తలపట్టుకుంటున్నారు.

చూస్తూ ఊరుకోం..

యురేనియం ముసుగులో నల్లమలను నాశనం చేయడం ద్వారా ప్రభుత్వమే మాకు మరణ శాసనం రాస్తోంది. ప్రజలు, వన్యప్రాణుల ప్రాణాలను ఫణంగా పెట్టబోతున్నది. కృష్ణా నదిని, ప్రకృతి సమతౌల్యాన్ని పట్టించుకోకుండా మొండిగా ముందుకు వెళ్తున్నది. నల్లమలను ఏవిధంగా కాపాడుకోవాలో మాకు తెలుసు. మా బతుకులను బొంద పెడ్తామంటే చూస్తు ఊరుకోం.

–నాసరయ్య,
యురేనియం వ్యతిరేక  పోరాట కమిటీ