నాటో తూర్పుకొస్తే.. మిలటరీ దింపుతం

నాటో తూర్పుకొస్తే.. మిలటరీ దింపుతం
  • నాటోలో ఫిన్లాండ్, స్వీడన్ చేరికపై రష్యా హెచ్చరిక 
  • మరియుపోల్ నుంచి డాన్బాస్ ఫోకస్ మళ్లింపు 
  • ఉక్రెయిన్​కు.. యూఎస్, జీ7 4.53 లక్షల కోట్ల సాయం


కీవ్/మాస్కో:  నాటో కూటమికి తూర్పు దిశగా విస్తరిస్తూ తమ సరిహద్దు దేశాల్లోకి వస్తే.. తాము పశ్చిమ సరిహద్దుల్లో మరిన్ని మిలటరీ బేస్ లు ఏర్పాటు చేసుకుంటామని రష్యా హెచ్చరించింది. రష్యా సమీపంలో మిలటరీ బేస్​ల ఏర్పాటు కోసమే ఫిన్లాండ్, స్వీడన్ కు నాటో విస్తరిస్తోందని శుక్రవారం రష్యా రక్షణ మంత్రి సెర్గీ సోయిగు అన్నారు. నాటో విస్తరణతో తమకు సైనికపరంగా ముప్పు ఏర్పడితే తగిన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ఇక మరియుపోల్ స్టీల్ ప్లాంట్ నుంచి ఇప్పటికే 1700 మంది ఉక్రెయిన్ ఫైటర్లను రష్యా తరలించగా.. ఇంకా కొద్దిమంది మాత్రమే ప్లాంటులో ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. మరియుపోల్ ప్లాంట్ నుంచి రష్యా తరలిస్తున్న ఉక్రెయిన్ ఫైటర్ల వివరాలు తీసుకుంటూ రెడ్ క్రాస్ సంస్థ యుద్ధ ఖైదీలుగా వారి పేర్లను నమోదు చేస్తోంది. మరోవైపు, డాన్బాస్ పై దాడులు పెంచిన రష్యా.. శుక్రవారం లుహాన్స్క్ లోని సెవెరోడోనెట్స్క్, లిసిచాన్స్క్ సిటీలపై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 12 మంది చనిపోగా, 60 ఇండ్లు ధ్వంసమయ్యాయి. డాన్బాస్ ను రష్యా సర్వనాశనం చేస్తోందని, ఆ ప్రాంతం నరకాన్ని తలపిస్తోందని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ మండిపడ్డారు. 

ఉక్రెయిన్ కు మరో 3 లక్షల కోట్ల ప్యాకేజీ

రష్యా దండయాత్రతో సంక్షోభంలో కూరుకుపోయిన ఉక్రెయిన్ కు మరో 40 బిలియన్ డాలర్ల (రూ. 3 లక్షల కోట్లు) ప్యాకేజీకి అమెరికన్ సెనేట్ ఆమోదం తెలిపింది.

గుజరాత్ డైమండ్ ఇండస్ట్రీపై యుద్ధం ఎఫెక్ట్  

రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో గుజరాత్ సూరత్​లోని డైమండ్ ఇండస్ట్రీపై భారీ ఎఫెక్ట్ పడింది. యుద్ధం వల్ల కట్టింగ్, పాలిషింగ్ కోసం రష్యా నుంచి ముడి వజ్రాలు రావడం ఆగిపోవడంతో ఇక్కడి డైమండ్ పాలిషింగ్ పరిశ్రమకు ఇబ్బందులు మొదలయ్యాయి. రష్యాకు చెందిన అల్రోసా డైమండ్ మైనింగ్ కంపెనీ నుంచి సూరత్​కు, ముంబైకి నేరుగా ముడి వజ్రాలు వస్తుంటాయి. ‘‘సూరత్ కు ప్రతినెలా 1.75 లక్షల క్యారట్ల ముడి వజ్రాలు వచ్చేవి. ఒక్క అల్రోసా కంపెనీ నుంచే 35 శాతం రా మెటీరియల్ అందేది. ఇప్పుడు అది బంద్ అయింది. ఉన్న స్టాక్ ఇపుడు అయిపోవచ్చింది” అని లోకల్ వ్యాపారులు చెప్తున్నారు.