
ముఖంపై నల్ల మచ్చలు రావడానికి చాలా కారణాలుంటాయి. ముఖ్యంగా చర్మానికి రంగునిచ్చే మెలనిన్ శరీరంపై కొన్ని చోట్ల అధిక స్థాయిలో పేరుకుపోవడం వల్ల ఆ భాగాల్లోనే ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. దీంతోపాటు గర్భధారణ, డెలివరీ తర్వాత, మెనోపాజ్ సమయంలో వచ్చే హార్మోన్ల మార్పుల వల్ల మచ్చలు ఏర్పడతాయి. ఎండ, పొడిబారిన చర్మం కూడా దీనికి కారణమే. ఈ సమస్యలకు మొదటి పరిష్కారం మంచి నీళ్లే. రోజుకి 10 గ్లాసుల నీరు తాగుతూ, గ్లాసు పచ్చి కూరగాయల రసం తీసుకుంటే ఈ మచ్చలు తగ్గుతాయి. అలాగే రోజువారీ ఆహారంలో పండ్లు భాగం చేసుకుని, మసాలా, కారం తగ్గించాలి. ముఖంపై ఎండ పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే పుల్లని పెరుగులో బార్లీ పిండిని కలిపి ముద్దలా చేసి మచ్చలపై లేపనంలా పూయాలి. పదిహేను నిమిషాల తరువాత కడగాలి. ఇలా రోజూ చేస్తే మచ్చల సమస్య తగ్గుతుంది.