బ్రేకింగ్: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్

బ్రేకింగ్: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్

హైదరాబాద్: జూబ్లీహిల్స్ బైపోల్‎కు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. యువ నేత నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపికయ్యారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నవీన్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం (అక్టోబర్ 8) అధికారిక ప్రకటన విడుదల చేశారు. జూబ్లీహిల్స్ టికెట్ కోసం అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర పోటీ ఉండటంతో అభ్యర్థి ఎంపికలో అధిష్టానం ఆచితూచి వ్యవహరించింది. 

అన్ని సమీకరణాలను పరిగణలోకి తీసుకుని చివరకు నవీన్ యాదవ్ పేరును ఫైనల్ చేసింది. కాగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ప్రతిపక్ష బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థి పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. దివంగత నేత మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీతను బీఆర్ఎస్ బరిలోకి దింపింది. ఇక, బీజేపీ తమ అభ్యర్థి పేరును అనౌన్స్ చేయాల్సి ఉంది. 

ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతితో జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్‎కు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో అక్టోబర్ 6న జూబ్లీహిల్స్ బైపోల్ షెడ్యూల్ ప్రకటించింది జాతీయ ఎన్నికల సంఘం. 2025, నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుండగా.. నవంబర్ 14న కౌంటింగ్ జరగనుంది. రాష్ట్రంలో ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నికను అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 

సీట్టింగ్ సీటు కాపాడుకోవాలని బీఆర్ఎస్ తాపత్రయ పడుతుండగా.. కంటోన్మెంట్ మాదిరిగానే జూబ్లీహిల్స్ సీటు కూడా దక్కించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. ఇక గ్రేటర్‎లో మంచి పట్టున్న బీజేపీ జూబ్లీహిల్స్ గడ్డపై కాషాయ జెండా రెపరెపలాడించాలని ఉవ్విళ్లూరుతోంది. అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. మరీ జూబ్లీహిల్స్ గడ్డ మీద ఏ పార్టీ జెండా ఎగురుతుందో చూడాలంటే నవంబర్ 14 వరకు వెయిట్ చేయాల్సిందే. 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక  షెడ్యూల్

  • అక్టోబర్ 13 న నోటిఫికేషన్
  • అక్టోబర్ 13న నామినేషన్ల స్వీకరణ
  • అక్టోబర్ 21న నామినేషన్లకు చివరి తేది
  • అక్టోబర్ 22న నామినేషన్ల పరిశీలన
  • అక్టోబర్ 24న నామినేషన్ల విత్ డ్రా
  • నవంబర్ 11న పోలింగ్
  • నవంబర్ 14న కౌంటింగ్