హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు విద్యాశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. అడ్మిషన్లు తక్కువున్న బడుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ప్రతి చిన్నారినీ బడిలో చేర్పించేలా పక్కా ప్లాన్ చేస్తోంది. ప్రధానంగా గతేడాది ఒక్క అడ్మిషన్ కూడా జరగని (జీరో ఎన్‌రోల్‌మెంట్) బడుల్లో ఈసారి కనీస సంఖ్యలోనైనా విద్యార్థులను చేర్పించి వాటిని పునర్ ప్రారంభించాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. విద్యార్థుల సంఖ్య 15 లోపు ఉన్న స్కూళ్లలో ఈ విద్యా సంవత్సరం అడ్మిషన్లను రెట్టింపు చేయాలని టార్గెట్ విధించారు. గత మూడేండ్లుగా వరుసగా అడ్మిషన్లు తగ్గుతున్న బడులను గుర్తించి, కారణాలను విశ్లేషించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
