
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరును ఆ పార్టీ హైకమాండ్ ప్రకటించింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆమోదంతో పేరును ఖరారు చేస్తున్నట్లు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం రాత్రి ప్రకటన విడుదల చేశారు. మంగళవారమే సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, పార్టీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ జూమ్ లో సమావేశమై నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఏఐసీసీకి సిఫారసు చేశారు. రాష్ట్ర నాయకత్వం చేసిన సిఫారసును 24 గంటల్లోనే ఏఐసీసీ ఆమోదించి.. కొన్నిరోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతితో ఖాళీ అయిన ఈ సీటుకు వచ్చే నెల 11న పోలింగ్ జరగనుంది.
మొదటి నుంచి బీసీ వైపే మొగ్గు
జూబ్లీహిల్స్లో పార్టీ అభ్యర్థి ఎంపిక కోసం కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. బీసీ రిజర్వేషన్ల అమలుపై ఇటు కాంగ్రెస్, అటు రాష్ట్ర ప్రభుత్వం చట్టపరమైన, న్యాయపరమైన పోరాటం చేస్తున్న సమయంలో జూబ్లీహిల్స్ సీటును బీసీకే ఇవ్వాలని పీసీసీ మొదటి నుంచి భావిస్తున్నది. చివరికి అదే వర్గానికి చెందిన వ్యక్తికి టికెట్ ఖరారైంది. ఇక్కడి నుంచి పోటీకి బీసీ సామాజికవర్గానికి చెందిన మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఇతర సామాజిక వర్గాల వారు ఆసక్తి చూపినా నవీన్ యాదవ్ నే టికెట్వరించింది.
ఇటు కాంగ్రెస్ పార్టీ, అటు ప్రభుత్వం తరఫున పలు దఫాలుగా చేసిన సర్వేలు, ఈ నియోజవర్గానికి ఇన్చార్జ్ మంత్రులుగా వ్యవహరిస్తున్న వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్ రావు చేసిన సిఫారసులను పరిగణనలోకి తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, పార్టీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ .. నవీన్ యాదవ్ అభ్యర్థిత్వానికే మొగ్గు చూపారు. హైకమాండ్ కూడా ఈ సిఫారసుకు ఆమోదం తెలపడంతో ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ప్రచారం మరింత జోరందుకోనుంది.
2014, 2018లోనూ పోటీ
41 ఏండ్ల నవీన్ యాదవ్ హైదరాబాద్ లోని యూసఫ్‌గూడకు చెందిన వారు. బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో డిగ్రీ పొందారు. ఆయన తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ సిటీలో పేరున్న సోషల్ వర్కర్. తెలంగాణ త్రోబాల్ అసోషియేషన్ కు రాష్ట్ర అధ్యక్షుడిగా నవీన్ యాదవ్ కొనసాగుతున్నారు. ఆయన 2014లో మొదటిసారి మజ్లిస్ పార్టీ తరపున జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కేవలం 9 వేల పైచిలుకు స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిచెందారు. 2018లో ఇక్కడి నుంచే ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరిన నవీన్ యాదవ్.. నియోజకవర్గ ఇన్చార్జ్గా ఉన్నారు. అప్పటి నుంచి పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు.