- దక్షిణాఫ్రికా జడ్జి నవనీతమ్ పిళ్లైకి అత్యున్నత పురస్కారం
- వివక్షపై విజయం సాధించిన నవీ.. లైంగికదాడి నరమేధమేనని తీర్పు
- నెల్సన్ మండేలా చొరవతో 1995లో సుప్రీంకోర్టు జడ్జిగా..
- మానవ హక్కుల పరిరక్షణకు చట్టాల బలోపేతంలో కీలక పాత్ర
- నవీ పూర్వీకులది తమిళనాడు
స్టాక్‌హోమ్: భారత సంతతికి చెందిన దక్షిణాఫ్రికా మహిళను నోబెల్ శాంతి బహుమతి వరించింది. భారతీయ తమిళ సంతతికి చెందిన న్యాయవాది నవనీతమ్ (నవీ) పిళ్లై ఈ సంవత్సరం నోబెల్ శాంతి బహుమతికి ఎంపికయ్యారు. శాంతి స్థాపన, అంతర్జాతీయ చట్టాల పరిరక్షణ, మానవ హక్కుల కోసం ఆమె చేసిన దశాబ్దాల కృషిని గుర్తిస్తూ నార్వేజియన్ నోబెల్ కమిటీ ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. అంతర్జాతీయ స్థాయిలో న్యాయం, జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడంలో ఆమె పోషించిన పాత్రకు ఈ గౌరవం దక్కింది. వర్ణవివక్ష వ్యతిరేక పోరాటం నుంచి మానవ హక్కుల పరిరక్షణ, అంతర్జాతీయ చట్టాల బలోపేతం వరకు ఆమె అందించిన విశేష సేవలకు గాను ఆమెను శాంతి బహుమతికి ఎంపిక చేసినట్టు నార్వేజియన్ నోబెల్ కమిటీ చైర్మన్ జోర్గెన్ వాట్నే ఫ్రైడ్నెస్ ప్రకటించారు. అహింసాయుతంగా వివాదాలను పరిష్కరించుకోవడానికి అంతర్జాతీయ న్యాయ సూత్రాలు ఎంతగానో అవసరమని, యుద్ధ నేరస్థులను చట్టం ముందుకు తీసుకురావడం శాంతికి పునాది అని కమిటీ పేర్కొంది.వివక్ష నుంచి విజయం
శ్వేతజాతీయుల కోసం రిజర్వ్ చేసిన పార్కులు, బీచుల్లోకి ఆమెను రానివ్వలేదు. డిగ్రీ పూర్తయ్యాక లాయర్‌గా ప్రాక్టీస్ చేయడం కోసం ఆమె కొన్ని కంపెనీలకు దరఖాస్తు చేసుకున్నారు. అక్కడున్న శ్వేతజాతీయులు ఆమెకు అవకాశమివ్వలేదు. ‘‘నల్లజాతీయురాలు ఇచ్చే ఆదేశాలను శ్వేతజాతీయులు వినే పరిస్థితి ఉంటుందా?’ అని హేళన చేశారు. దీంతో ఆమే సొంతంగా న్యాయ సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. న్యాయవాదిగా ఉన్నప్పుడు వర్ణ వివక్ష కారణంగా తనను కనీసం జడ్జి ఛాంబర్‌లోకి కూడా అడుగుపెట్టనివ్వలేదని ఆమె ఓ సందర్భంలో తెలిపారు. 1995లో నాటి దక్షిణాఫ్రికా అధ్యక్షుడు నెల్సన్ మండేలా ఆమెను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించారు. అప్పుడే ఆమె తొలిసారి జడ్జి ఛాంబర్‌లోకి వెళ్లారు. దక్షిణాఫ్రికాలో శ్వేతజాతియేతర తొలి మహిళా న్యాయమూర్తిగా ఆమె గుర్తింపు సాధించారు. ఆ తర్వాత 2003–2008 మధ్య ఆమె అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు న్యాయమూర్తిగా, 2008 నుంచి 2014 వరకు యూఎన్ మానవ హక్కుల కమిషనర్‌గా, 2019లో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్‌కు న్యాయమూర్తిగా ఎన్నికయ్యారు. మహిళల హక్కుల కోసం ‘ఈక్విటీ నౌ’ అనే సంస్థను కూడా స్థాపించారు.
లైంగిక దాడి యుద్ధనేరమేనని..
1999లో ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రైబ్యునల్ ఫర్ రువాండాకు నవనీతమ్ న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ సమయంలో ఓ లైంగిక వేధింపుల కేసులో ఆమె ఇచ్చిన తీర్పు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. రువాండాలోని టాబా ప్రాంత మేయర్ అయిన అతడి పాలనలో అనేక దారుణాలు జరిగాయి. దాదాపు 2వేల మంది హత్యకు గురయ్యారు. ఈ కేసులో బాధితులైన వందల మంది మహిళల ఆక్రందనలను నవనీతమ్ స్వయంగా విన్నారు. మారణహోమానికి అత్యాచారాన్ని ఆయుధంగా వాడుకున్నారని, ఇది యుద్ధనేరమే అని పేర్కొంటూ నిందితుడికి శిక్ష విధించారు.
బస్సు డ్రైవర్ కూతురుగా..
పిళ్లై 1941లో దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లోని ఒక పేద కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి ఓ బస్ డ్రైవర్. ఏడుగురు సంతానంలో ఆమె ఒకరు. 1890లలో ఆమె తాతముత్తాతలు చెరకు తోటల్లో కూలీలుగా పనిచేసేందుకు తమిళనాడు నుంచి దక్షిణాఫ్రికాకు వలస వెళ్లారు. ఆమె బాల్యంలో తీవ్రమైన వర్ణవివక్ష ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదురయినప్పటికీ నతాల్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందిన పిళ్లై.. ఆ తర్వాత ప్రతిష్టాత్మక హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి 1988లో డాక్టరేట్ పూర్తి చేశారు. 1967లో నతాల్ ప్రావిన్స్‌లో సొంతంగా లా ప్రాక్టీస్ ప్రారంభించిన మొదటి మహిళగా నిలిచారు.
