పార్లమెంట్ లో జైశ్రీరాం అనడానికి ఇది గుడి కాదు

పార్లమెంట్ లో జైశ్రీరాం అనడానికి ఇది గుడి కాదు

ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ అంశంగా కూడా మారిపోయిన జై శ్రీరాం నినాదాలు పార్లమెంటులో ఎంపీల ప్రమాణస్వీకార సమయంలోనూ సోమవారంనాడు చోటుచేసుకున్నాయి. పశ్చిమబెంగాల్‌లోని అసోంసాల్ నుంచి ఎంపీగా ఎన్నికైన బాబుల్ సుప్రియో ప్రమాణస్వీకారానికి లేచినప్పుడు అధికార పార్టీ సభ్యులు లోక్‌సభలో ‘జై శ్రీరాం’ నినాదాలు హోరెత్తించారు. అయితే పార్లమెంట్ లో జై శ్రీరాం నినాదాలు చేయడంపై సీరియస్ అయ్యారు మహారాష్ట్రలోని అమరావతి ఇండిపెండెంట్ ఎంపీ నవనీత్ కౌర్ రానా.

జై శ్రీరామ్ నినాదాలు చేయడానికి ఇది దేవాలయం కాదు ..పార్లమెంట్ అన్నారు. జై శ్రీరాం అనడానికి దేశంలో చాలా దేవాలయాలున్నాయని అక్కడికెళ్లి నినాదాలు చేయండని చెప్పారు. దేవుడు ఒక్కడేనని ప్రత్యేకంగా జై శ్రీరాం పేరుతో గొడవ చేయడం సరికాదని తెలిపారు ఎంపీ నవనీత్ కౌర్ రానా.

నవనీత్ కౌర్ విషయానికొస్తే..

శ్రీను వాసంతి లక్ష్మి, శత్రువు, మహాదేవ వంటి కొన్ని సినిమాల్లో నటించింది. తెలుగులో మంచి బ్రేక్ రాలేదు. ఆ తర్వాత  కొన్ని ఐటెం సాంగ్స్ కూడా చేసింది. అక్కడా ఆమెకు కలిసిరాలేదు. దీంతో మహారాష్ట్ర వెళ్లి అక్కడే సెటిల్ అయ్యింది. అదే టైంలో ఆ రాష్ట్రానికి చెందిన రవిరాణా అనే రాజకీయ నాయకుడిని వివాహం చేసుకుంది.

రవిరాణా స్వాభిమాన్ పార్టీ నాయకుడు. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కాగా, ఈ పార్టీ నుంచి నవనీత్ కౌర్ 2019 ఎన్నికల్లో అమరావతి పార్లమెంట్ నియోజక వర్గం నుంచి ఎంపీగా పోటీ చేసింది. మహారాష్ట్రలో బీజేపీ ప్రభంజనాన్ని సృష్టిస్తుంటే… దానిని తట్టుకొని నిలబడి అమరావతి నుంచి విజయం సాధించింది నవనీత్ కౌర్. ఎంపీగా మొదటిసారి పార్లమెంట్ లోకి అడుగుపెట్టిన రోజే తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చి అందరిని తనవైపు తిప్పుకున్నారు  ఎంపీ నవనీత్ కౌర్.