జైలు నుంచి విడుదలైన నవనీత్ రానా దంపతులు

జైలు నుంచి విడుదలైన నవనీత్ రానా దంపతులు

మహారాష్ట్ర : హనుమాన్ చాలీసా వివాదంలో అరెస్టైన ఎంపీ నవనీత్ కౌర్ రానా దంపతులు జైలు నుంచి విడుదలయ్యారు. ముంబై బోరివలీ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో వారిద్దరు బైకులా జైలులో ఉన్న  నవనీత్ రానా, తలోజా జైలులో ఉన్న రవి రానా బయటకు వచ్చారు. దంపతులిద్దరూ రూ.50వేల చొప్పున వ్యక్తిగత పూచీకత్తు సమర్పించిన అనంతరం అధికారులు వారిని విడుదల చేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే రానా దంపతులను మెడికల్ చెకప్ కోసం తీసుకెళ్లారు. 

సీఎం ఉద్దవ్‌ థాక్రే ఇంటి ముందు హనుమాన్‌ చాలీసా పఠిస్తామని నవనీత్ రానా దంపతులు ప్రకటించారు. వారి ప్రకటనతో ముంబైలో ఉద్రిక్తతతలు చోటు చేసుకునే అవకాశముందన్న కారణంతో పోలీసుల ఏప్రిల్ 23న వారిని అదుపులోకి తీసుకుని కోర్టు ఆదేశాల మేరకు జైలుకు తరలించారు. అప్పటి నుంచి ఈ జంట బెయిల్ కోసం ప్రయత్నిస్తోంది. తమ అరెస్ట్ చట్టానికి, రాజ్యాంగానికి విరుద్ధమన్న వాదనలను రానా దంపతులు కోర్టు ముందుంచారు. నోటీసులు ఇవ్వకుండానే పోలీసులు తమను అరెస్టు చేశారని, తమ వాక్ స్వాతంత్ర్యాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛను అణచివేయాలన్న ఉద్దేశంతోనే దేశద్రోహం కేసు పెట్టారని న్యాయమూర్తికి విన్నవించారు. ఎంపీ వాదనలను పోలీసులు ఖండించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ముంబై సెషన్స్ కోర్టు న్యాయమూర్తి రానా దంపతులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. నవనీత్ రానా దంపతులను విచారణకు పిలవాలంటే 24గంటల ముందు నోటిసులివ్వాలని ముంబై పోలీసులను ఆదేశించారు.