పారామోటరింగ్ చేస్తున్న నేవీ కెప్టెన్ 100 మీటర్ల ఎత్తు నుంచి సముద్రంలో పడి మృతిచెందిన ఘటన కర్ణాటకలో జరిగింది. కార్వార్‌లో కెప్టెన్‌గా పనిచేస్తున్న మధుసూదన్ రెడ్డి (55) శుక్రవారం సాయంత్రం తన కుటుంబ సభ్యులు మరియు మిత్రుడు విద్యాధర్ వైద్యతో కలిసి రవీంద్రనాథ్ ఠాగూర్ బీచ్‌కు వెళ్లారు. వారంతా అక్కడ పారామోటరింగ్ చేయాలనుకున్నారు. విద్యాధర్ పారాపైలట్ కావడంతో.. పారామోటరింగ్‌కు కావలసిన సామాగ్రిని ఆయనే తీసుకువచ్చాడు. కరోనా కారణంగా నెలల క్రితం మూతపడ్డ పారామోటరింగును ఆ బీచ్‌లో శుక్రవారమే ప్రారంభించారు.
మధుసూదన్ కుటుంబ సభ్యులందరి చేత విద్యాధర్ దగ్గరుండి పారామోటరింగ్ చేయించాడు. ఆ తర్వాత చివరగా మధుసూధన్‌ను పారామోటరింగ్ చేయించడానికి విద్యాధర్ తీసుకువెళ్లాడు. ఆయన ఫ్యామిలీ మొత్తం బీచ్ ఒడ్డున నిలబడి చూస్తున్నారు. మధుసూదన్ సముద్ర మట్టానికి 100 మీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు ఒక్కసారిగా పారామోటర్ ఆగిపోయింది. దాంతో వారిద్దరూ సముద్రంలో పడిపోయారు. విద్యాధర్ పారామోటర్ నుంచి విడిపించుకొని సముద్రంలోకి పడ్డాడు. కానీ, మధుసూదన్ మాత్రం విడిపించుకోలేకపోయాడు. పారామోటర్ తాడులో మధుసూదన్ చిక్కుకుపోయాడు. దాంతో మోటర్ బరువుకు మధుసూదన్ నీటిలో మునిగిపోయాడు. వెంటనే అక్కడున్న మత్స్యకారులు స్పందించి వారికోసం వెతికారు. విద్యాధర్‌ను వెతికి బయటకు తీశారు. కానీ, మధుసూదన్ మాత్రం వెంటనే దొరకలేదు. వెతకగా వెతకగా కాసేపటి తర్వాత మధుసూదన్ జాలర్లకు కనిపించాడు. వెంటనే ఆయనను బయటకు తీశారు.

ఈలోగా అక్కడున్న పోలీసులు అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. కానీ, అంబులెన్స్ మాత్రం ఫోన్ చేసిన 20 నిమిషాలకు కూడా రాలేదు. దాంతో మధుసూదన్‌ను పోలీస్ జీప్‌లో కార్వార్ డిస్ట్రిక్ట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. ఆస్పత్రికి వెళ్లిన తర్వాత ఆయనను పరిశీలించిన వైద్యులు.. చల్లటి నీటి షాక్ కారణంగానే కెప్టెన్ మధుసూధన్ మరణించినట్లు తెలిపారు. ‘కెప్టెన్ మధుసూధన్ అకస్మాత్తుగా 15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉన్న నీటిలో పడటం వల్ల షాక్‌లోకి వెళ్లి మరణించాడని వైద్యులు చెప్పారు’అని పోలీసులు తెలిపారు. బీచ్‌లో ప్రమాదం జరిగిన సమయంలో బయటి ఉష్ణోగ్రత ఎక్కువగానే ఉందని.. సముద్రంలో మాత్రం తక్కువగా ఉందని బీచ్ పోలీసులు తెలిపారు.
For More News..
