త్వరలో నక్సలిజం అంతం.. వందలాది మంది మావోయిస్టులు లొంగిపోయారు: మోదీ

త్వరలో నక్సలిజం అంతం.. వందలాది మంది మావోయిస్టులు లొంగిపోయారు: మోదీ
  •     మావోయిస్టు ప్రభావిత జిల్లాల సంఖ్య 125 నుంచి మూడుకు తగ్గింది

దేశంలో నక్సలిజం అంతమయ్యే రోజు మరెంతో దూరంలో లేదని ప్రధాని మోదీ అన్నారు. దేశంలో 11 ఏండ్ల కింద మావోయిస్టు ప్రభావిత జిల్లాల సంఖ్య 125 ఉండగా, ఇప్పుడది మూడు జిల్లాలకు పడిపోయిందని తెలిపారు. 

రాయ్‌‌పూర్: మన దేశంలో నక్సలిజం అంతమయ్యే రోజు మరెంతో దూరంలో లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో 11 ఏండ్ల కింద మావోయిస్టు ప్రభావిత జిల్లాల సంఖ్య 125 ఉండగా, ఇప్పుడది మూడు జిల్లాలకు పడిపోయిందని తెలిపారు. శనివారం నయా రాయ్‌‌పూర్‌‌‌‌లో నిర్వహించిన చత్తీస్‌‌గఢ్ 25వ అవతరణ దినోత్సవ వేడుకల్లో మోదీ పాల్గొని మాట్లాడారు. 

మావోయిస్టుల హింస కారణంగా చత్తీస్‌‌గఢ్  ఎన్నో  ఇబ్బందులు ఎదుర్కొందని ఆయన అన్నారు. ‘‘నక్సలిజం కారణంగా గత 50 ఏండ్లుగా ఇక్కడి ప్రజలు ఎన్నో బాధలు అనుభవిస్తున్నారు. మావోయిస్టు భావజాలంతో గిరిజన ప్రాంతాలకు కనీస సౌకర్యాలు అందకుండాపోయాయి.

 కొన్నేండ్ల పాటు రోడ్లు, స్కూళ్లు, ఆస్పత్రులనేవే లేకుండాపోయాయి. ఎప్పుడూ బాంబుల మోత మోగేది. డాక్టర్లు, టీచర్లను చంపేశారు. ఆనాడు దశాబ్దాల పాటు దేశాన్ని పాలించినోళ్లు ఆదివాసీలను పట్టించుకోలేదు. అడవి బిడ్డల జీవితాలు నాశనమవుతంటే, వాళ్లు మాత్రం ఏసీ రూమ్‌‌ల్లో ఎంజాయ్ చేశారు” అని గత పాలకులపై మండిపడ్డారు.

ఆనాడే నిర్ణయం.. 

2014లో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత నక్సలిజాన్ని అంతం చేయాలని సంకల్పం తీసుకున్నామని ప్రధాని మోదీ తెలిపారు. ‘‘మేం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదివాసీ తల్లుల కన్నీళ్లను చూసి చలించిపోయాను. నక్సలిజాన్ని అంతం చేయాలని ఆనాడే నిర్ణయించుకున్నాను. ఫలితం ఇప్పుడు మీ ముందే ఉంది. 

పదకొండేండ్ల కింద దేశవ్యాప్తంగా 125 జిల్లాల్లో మావోయిస్టుల ప్రభావం ఉండగా, ఇప్పుడా జిల్లాల సంఖ్య మూడుకు తగ్గింది. చత్తీస్‌‌గఢ్ సహా దేశమంతటా నక్సలిజం అంతమయ్యే రోజు మరెంతో దూరంలో లేదు. ఇది నేను మీకు ఇస్తున్న గ్యారంటీ” అని చెప్పారు. గత కొన్ని నెలల్లో వందలాది మంది మావోయిస్టులు లొంగిపోయారని పేర్కొన్నారు.

 ‘‘ఇటీవల కాంకేర్‌‌‌‌లో 20మంది మావోయిస్టులు లొంగిపోయారు. గత నెల బస్తర్‌‌‌‌లో 200మందికిపైగా మావోయిస్టులు సరెండరయ్యారు. ఇప్పుడు వాళ్లంతా రాజ్యాంగాన్ని గౌరవించి, శాంతి పథంలో నడుస్తున్నారు” అని అన్నారు.