
చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి రూపొందిస్తున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. పండక్కి వస్తున్నారు అనేది ట్యాగ్‌లైన్. చిరంజీవికి జంటగా నయనతార నటిస్తోంది. దసరా సందర్భంగా నయనతార పోషిస్తున్న పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. యెల్లో శారీలో ముత్యాల హారం, సంప్రదాయ గాజులతో అలరిస్తోంది నయనతార. ఇందులో ఆమె శశిరేఖ అనే పాత్రను పోషిస్తోందని, కథలో తన పాత్ర చాలా కీలకంగా ఉండబోతోందని ఈ సందర్భంగా మేకర్స్ తెలియజేశారు.
విజయదశమి రోజున మరో ప్రత్యేక సర్‌ప్రైజ్ ఉండబోతోందని చెప్పారు. ఇక సినిమా ప్రమోషన్స్‌కు దూరంగా ఉండే నయనతార.. ఈ సినిమా విషయంలో మాత్రం అనౌన్స్‌మెంట్ రోజు నుంచే చురుకుగా పాల్గొనడం ఆశ్చర్యపరుస్తోంది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.