డ్రగ్స్ కేసుకు ఇన్​చార్జి వాంఖడేనే

డ్రగ్స్ కేసుకు ఇన్​చార్జి వాంఖడేనే

ముంబై: క్రూయిజ్​ షిప్​లో డ్రగ్స్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ ఆఫీసర్​ సమీర్​ వాంఖడేకు ఎన్సీబీ మద్దతుగా నిలబడింది. ఆయనపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిస్తూనే.. వాంఖడేకు వ్యతిరేకంగా గట్టి ఆధారాలు దొరికేంత వరకూ కేసు విచారణకు ఇన్​చార్జిగా కొనసాగిస్తామని డిప్యూటీ డైరెక్టర్​ జనరల్(డీడీజీ) జ్ఞానేశ్వర్​ సింగ్​ తేల్చి చెప్పారు. లంచం డిమాండ్​ చేశారన్న ఆరోపణలకు సంబంధించి విజిలెన్స్ కమిటీ వాంఖడేను బుధవారం దాదాపు 4 గంటల పాటు ప్రశ్నించిందని వివరించారు. ఆర్యన్​ కేసుకు సంబంధించిన వివరాలన్నీ వాంఖడే అధికారులకు తెలిపారన్నారు. డిపార్ట్​మెంట్​చేపట్టిన ఈ విచారణ కొనసాగుతుందని అవసరమైతే వాంఖడేను మరోసారి ప్రశ్నిస్తామని చెప్పారు. ఇప్పటికే ఐదుగురు సభ్యుల టీమ్ ముంబై వెళ్లిందని, ఎన్సీబీ ఆఫీసు నుంచి కొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుందని తెలిపారు. వాంఖడే స్టేట్ మెంట్​తో పాటు సాక్షులందరి స్టేట్ మెంట్లను కూడా రికార్డు చేస్తామని వివరించారు. డ్రగ్స్ కేసు నుంచి ఆర్యన్ ఖాన్ ను తప్పించేందుకు సమీర్ వాంఖడే సహా మరికొంత మంది రూ.25 కోట్ల లంచం అడిగారని సాక్షి ప్రభాకర్ సెయిల్ ఆరోపించాడు.

ఆర్యన్ బెయిల్ విచారణ వాయిదా

డ్రగ్స్ కేసులో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ బెయిల్ పిటిషన్ పై విచారణను బాంబే హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. జస్టిస్ నితిన్ సాంబ్రే ఈ పిటిషన్ పై వరుసగా రెండోరోజు బుధవారం విచారణ చేపట్టగా.. ఆర్యన్ తరఫున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఆర్యన్ కు వ్యతిరేకంగా ఎలాంటి ఎవిడెన్స్ లేదని, అతడి దగ్గర డ్రగ్స్ దొరకలేదని చెప్పారు. సరైన కారణం లేకుండానే అతడిని అరెస్టు చేశారన్నారు. పోలీసులు ఎవరినైనా అరెస్టు చేస్తే, ఏ కారణం చేత అరెస్టు చేశారో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్సీబీ కోర్టును తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు.