
నిజాం షుగర్స్ అమ్మేందుకు NCLT ఉత్తర్వులు
నిజాం షుగర్ ఫ్యాక్టరీ చరిత్ర ముగిసిపోనుంది. తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఫ్యాక్టరీని తెరిపిస్తానని 2014 ఎన్నికలకు ముందు చెప్పిన కేసీఆర్ మాట నిజం కాలేదు. ఫ్యాక్టరీని కాపాడుకునేందుకు కార్మికులు, రైతులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఫ్యాక్టరీని అమ్మేందుకు లా ట్రైబ్యునల్ బుధవారం అనుమతిచ్చింది. దీంతో గురువారం కార్మికులు భగ్గుమన్నారు. మాటిచ్చి తప్పిన సర్కారు మీద నిప్పులు చెరిగారు. శక్కర్‌నగర్‌లో ప్రభుత్వ దిష్టిబొమ్మను కాల్చి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
నిజాం కాలంలో బోధన్‌లో ప్రారంభించిన చక్కెర ఫ్యాక్టరీ దేశంలోనే అతిపెద్దదిగా పేరు పొందింది. మొదట్లో లాభాల్లో నడిచిన ఫ్యాక్టరీ క్రమంగా నష్టాల బాట పట్టింది. టీడీపీ హయాంలో నష్టాల సాకుతో వాటాలను అమ్మడంతో ఈ ఫ్యాక్టరీ ప్రభావం మసకబారడం మొదలైంది. యాజమాన్య బాధ్యతలు తీసుకున్న సంస్థ క్రమంగా ఫ్యాక్టరీని ఖాయిలా పడేసింది. కార్మికులు, రైతులు ఫ్యాక్టరీని తిరిగి తెరిపించాలని, ప్రభుత్వమే నడిపించాలని చాలాకాలంగా పోరాడుతున్నారు. 2002 నుంచి ప్రతి ఎన్నికల్లో ఎన్‌ఎస్‌ఎఫ్ ఇష్యూ ప్రధానంగా ఉంటూ వస్తోంది. రైతులు, కార్మికుల ఆందోళనలతో రాజశేఖరరెడ్డి పవర్‌లోకి వచ్చిన తర్వాత శాసనసభా సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంఘం ప్రైవేటీకరణ రద్దు చేయాలని సిఫారసు చేసింది. ఈ సిఫారసు అమలు కోరుతూ చెరకు రైతులు రాష్ట్ర న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నిజాం షుగర్స్ ఫ్యాక్టరీల్లో 51 శాతం వాటా ఉన్న డెల్టాపేపర్స్ యాజమాన్యం ఫ్యాక్టరీల్లో ఆధునీకరణ పనుల కోసం రూ.270 కోట్లు ఖర్చు చేశామని, ఒక వేళ ఫ్యాక్టరీని పూర్తిగా ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలంటే ఈ మొత్తం తమకివ్వాలని డిమాండ్ చేసింది. దాంతో ఈ సిఫార్సుకు కాలం చెల్లింది. 2015లో లే ఆఫ్ ప్రకటించిన డెల్టా పేపర్స్ సంస్థ ఖాయిలా పరిశ్రమలుగా గుర్తించాలని కోరుతూ బీఐఎఫ్‌ఆర్‌కు వెళ్లింది. తరువాత సమస్య అక్కడి నుంచి కంపెనీ లా ట్రైబ్యునల్‌కు (ఎన్‌సీఎల్‌టీ) చేరింది.
చివరికి అమ్మకానికే మొగ్గు
నిజాం షుగర్స్‌కు చెందిన మూడు ఫ్యాక్టరీలు మూతబడటంతో అప్పులిచ్చిన బ్యాంకుల నుంచి ఒత్తిడి పెరిగింది. కంపెనీ బోర్ట్ ఆఫ్ డైరెక్టర్లుగా బ్యాంకర్లే కూర్చున్నారు. నిర్ణయాలన్నీ వీరి ఆధ్వర్యంలోనే జరిగిపోయాయి. లా ట్రైబ్యునల్ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు లిక్విడేటర్‍గా రామకృష్ణ గుప్తాను నియమించింది. ఫ్యాక్టరీలు మూతబడకుండా బ్యాంకు అప్పులు తీర్చే మార్గాలను మొదట అన్వేషించడంపై దృష్టి పెట్టారు. అనుభవమున్న పారిశ్రామికవేత్తలను ఆహ్వానించినప్పటికీ కొన్ని కంపెనీలను బ్యాంకర్ల కమిటీ రిజెక్ట్ చేసింది. ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలకు ముందుకు రాలేదు. ఫ్యాక్టరీలను అమ్మే పరిస్థితి రాకుండా ప్రత్యామ్నాయాలకోసం ప్రభుత్వ అడిగిన గడువు ముగియడంతో చివరకు ట్రైబ్యునల్ ఫ్యాక్టరీల అమ్మకానికి ఆదేశాలు వెలువరించింది.
కంపెనీ లా ట్రైబ్యునల్ ఆదేశాలు సవాలు చేస్తూ అప్పీలుకు వెళ్లే అవకాశం ప్రభుత్వానికి ఉంది. కానీ ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుందో చూడాలి.
నెరవేరని కేసీఆర్
వంద రోజుల హామీ
నిజాం షుగర్స్ ఇష్యూ తెలంగాణ ఉద్యమంలోనూ ప్రధాన అంశమైంది. 2014 ఎన్నికలకు ముందు బోధన్‌లో ప్రచారానికి వచ్చిన కేసీఆర్ టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఫ్యాక్టరీ తెరిపిస్తామని హామీ ఇచ్చారు. అనుకున్నట్టే ఆయన పవర్లోకొచ్చారు. తర్వాత రైతులు, కార్మికులు అనేకసార్లు టీఆర్‌ఎస్ నేతలను, నిజామాబాద్ ఎంపీగా ఉన్న కేసీఆర్ బిడ్డ కవితను కలిసి ఫ్యాక్టరీని తిరిగి తెరిపించేందుకు చొరవ చూపాలని కోరారు. అనేక సందర్భాల్లో ప్రభుత్వమే ఫ్యాక్టరీ నడిపిస్తుందని హామీ ఇచ్చిన సర్కారు ఆ తర్వాత ప్రత్యామ్నాయాలను సూచించింది. మహారాష్ట్ర తరహాలో రైతుల సహకార సంఘాలు పెట్టి యాజమాన్యాన్ని వారికి అప్పగించాలని చూసింది. మహారాష్ట్రలో ఫ్యాక్టరీల నిర్వహణ పరిశీలించేందుకు అప్పటి వ్యవసాయ శాఖమంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో రైతులను అక్కడికి పంపింది. ఈ ప్రతిపాదనలను రైతులు వ్యతిరేకించారు. పూర్తిగా ప్రభుత్వ యాజమాన్యంలోనే ఫ్యాక్టరీని నడిపించాలని కోరినా కేసీఆర్ సర్కారు పట్టించుకోలేదు.
సర్కారు స్పందించాలి
– పుట్ట వరదయ్య,
నిజాంషుగర్స్ పరిరక్షణ కమిటీ నాయకుడు
ప్రభుత్వం పట్టించుకోలేదు
నిజాంషుగర్స్ ను బతికించుకోవడానికి ఓ పక్క కార్మికులు, కర్షకులు ఆందోళనలు చేస్తుంటే కేసీఆర్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే నిజాం షుగర్స్ ను తెరిపిస్తానని, పూర్వవైభవం తెస్తానన్న పెద్దమనిషి ఫ్యాక్టరీలు అమ్మే పరిస్థితి వచ్చినా కిమ్మనకుండా ఉన్నాడు. ఇప్పటికైనా బాధ్యతగా వ్యవహరించాలి.
– రవిశంకర్ గౌడ్, నిజాం షుగర్స్
మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ