కూటమిలో గొడవలు రానీయం: శరద్ పవార్

కూటమిలో గొడవలు రానీయం: శరద్ పవార్
  • ఎన్నికల సమయంలో సర్దుబాట్లపై జాగ్రత్తలు తీసుకుంటం: శరద్ పవార్  

పుణె/న్యూఢిల్లీ: పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష ఇండియా కూటమిలోని పార్టీల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తే అవకాశం ఉందని ఎన్ సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. కూటమిలో ఎలాంటి వివాదాలు వచ్చినా తటస్థంగా ఉండే నేతలను పంపి సయోధ్య కుదిరేలా చూస్తామని ఆయన చెప్పారు. 

శుక్రవారం మహారాష్ట్ర పుణె జిల్లాలోని బారామతి వద్ద మీడియాతో పవార్ మాట్లాడారు. ప్రస్తుతం రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్నందున ఆ రెండు రాష్ట్రాల్లో కూటమి పార్టీల మధ్య వివాదాలు లేకుండా చూడటం కోసం మరో వారం పది రోజుల్లో కసరత్తు మొదలుపెడతామని ఆయన తెలిపారు. 

మరాఠా రిజర్వేషన్లకు సంబంధించి సీఎం ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చూసిన తర్వాత దానిపై మాట్లాడతామన్నారు. ఉల్లి ఎగుమతులపై 40 శాతం ఎక్స్ పోర్ట్ డ్యూటీ వేయడం రైతులకు అన్యాయం చేయడమేనని అభిప్రాయపడ్డారు. ఎక్స్ పోర్ట్ డ్యూటీని ఎత్తేయాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు.