- దేశంలో మొత్తంగా 6 శాతం తగ్గిన నేరాలు
- తెలంగాణలో 33,967 కేసులు అదనంగా రిపోర్ట్
- 27,230 సైబర్‌క్రైం కేసులతో మొదటి స్థానంలో తెలంగాణ
- 2024 రిపోర్టులో వెల్లడించిన ఎన్‌సీఆర్‌బీ
తెలంగాణలో సైబర్ నేరాల నమోదు ఆందోళనకరంగా మారింది. 2024 లో దేశంలోనే అత్యధిక సైబర్ నేరాలతో రాష్ట్రంగా మొదటి స్థానంలో నిలిచింది. 2024లో అన్ని రకాల నేరాలకు సంబంధించి దేశంలో 6% తగ్గుదల నమోదుకాగా, 2023తో పోలిస్తే 2024లో తెలంగాణలో 33,967 కేసులు అదనంగా నమోదయ్యాయని ఎన్‌సీఆర్‌బీ రిపోర్ట్ వెల్లడించింది.
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో సైబర్ నేరాల నమోదు ఆందోళనకరంగా మారింది. 2024లో దేశంలోనే అత్యధిక సైబర్ నేరాలు నమోదైన రాష్ట్రంగా మొదటి స్థానంలో నిలించింది. 2024లో అన్ని రకాల నేరాలకు సంబంధించి దేశంలో ఆరు శాతం తగ్గుదల నమోదుకాగా, 2023 తో పోలిస్తే 2024లో తెలంగాణలో 33,967 కేసులు అదనంగా రిపోర్ట్ అయ్యాయి. ఈ మేరకు 2024 నివేదికను నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) గురువారం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో నమోదైన నేరాలకు సంబంధించిన గణాంకాలు వెల్లడించింది. రిపోర్టులో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి.
రెగ్యులర్ క్రైమ్‌లో 7వ స్థానం
దేశవ్యాప్తంగా 2024లో మొత్తం అన్ని రకాల నేరాలు కలిపి 58,85,867 నమోదు కాగా..2023లో మొత్తం కేసుల సంఖ్య 62,41,569 గా నమోదైంది. 2023తో పోలిస్తే 2024లో కేసుల నమోదు సంఖ్యలో ఆరు శాతం (3,55,702) తగ్గుదల నమోదైంది. కాగా, తెలంగాణలో అన్ని రకాల నేరాలకు సంబంధించి 2023లో 1,83,644 కేసులు నమోదు కాగా, 2024లో 33,967 అదనంగా మొత్తం 2,17,976 కేసులు అయ్యాయి. ఈ మేరకు అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల్లో 7 వ స్థానంలో నిలిచింది.
ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా 2024లో సైబర్ నేరాలకు సంబంధించిన మొత్తం 1,01,928 కేసులు నమోదు కాగా, 2023లో సైబర్‌నేరాల కేసుల సంఖ్య 86,420 గా నివేదిక తెలిపింది. 17.9% పెరిగినట్లు వెల్లడించింది. వీటిలో దేశంలోనే అత్యధికంగా 27,230 సైబర్ క్రైం కేసులు నమోదైన రాష్ట్రంగా తెలంగాణ మొదటి స్థానంలో నిలువగా.. తర్వాతి స్థానంలో కర్నాటక (21,993 కేసులు), ఉత్తర ప్రదేశ్ (11,073 కేసులు), మహారాష్ట్ర (9,922 కేసులు) నిలిచాయి.
భర్త, కుటుంబ సభ్యుల క్రూరత్వం పెరిగింది
మహిళలు, చిన్నారులపై నేరాల నమోదుకు సంబంధించి 2024లో మహిళలు, పిల్లలపై జరిగిన నేరాలు మొత్తం 2,84,530 కేసులు నమోదయ్యాయి. వీటిలో భార్యలపై భర్త లేదా అతని బంధువుల క్రూరత్వం(1,20,227) కేసులు అత్యధికంగా ఉన్నాయి. మొత్తం కేసుల్లో ఇవే 42.3 శాతం ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులు 48,303, అత్యాచారం 29,536 కేసులు నమోదు అయ్యాయి. కాగా, 2024లో 144 వరకట్న హత్యలు నమోదుకాగా, 10,061 భర్త, అతడి కుటుంబ సభ్యుల హింసకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి.
హత్య కేసుల్లో -స్వల్పంగా తగ్గుదల..
2024లో మొత్తం 27,049 హత్య కేసులు నమోదైనట్టు ఎన్‌సీఆర్‌బీ 2024 నివేదిక వెల్లడించింది. 2023 తో పోలిస్తే హత్య కేసులు సంఖ్య (27,721)లో 2.4 శాతం స్వల్ప తగ్గుదలను సూచిస్తుంది. 2024లో అత్యధిక సంఖ్యలో నమోదైన హత్య కేసులలో వివాదాల కారణంగా 9,607 హత్య కేసులు, ఆ తర్వాతి స్థానాల్లో వ్యక్తిగత కక్ష లేదా వైరానికి సంబంధించినవి 3,638 కేసులు, ఆస్తి, లేదా ఇతర లాభం కోసం జరిగిన హత్యలకు సంబంధించినవి మరో 1,460 కేసులు ఉన్నాయి. కాగా, 2024లో తెలంగాణ వ్యాప్తంగా 1040 హత్య కేసులు, 2023లో 954 హత్యలు జరిగినట్టు నివేదిక తెలిపింది.
15.4 శాతం తగ్గిన కిడ్నాప్, అపహరణ కేసులు
2024లో దేశవ్యాప్తంగా మొత్తం 96,079 కిడ్నాప్, అపహరణ కేసులు నమోదయ్యాయి. ఇది 2023తో (1,13,564 కేసులు) పోలిస్తే 15.4 శాతం తగ్గినట్టుగా ఎన్‌సీఆర్‌బీ 2024 నివేదిక స్పష్టం చేస్తోంది. కాగా 2024లో కిడ్నాప్, అపహరణకు గురైన వారిలో మొత్తం 1,10,433 మందిని పోలీసులు తిరిగి గుర్తించారు. కాగా, ఇందులో 1,10,087 మంది సజీవంగా లభించగా, 346 మంది మరణించిన స్థితిలో కనుగొనబడ్డారు. తెలంగాణలో 2024లో మొత్తం 3,372 కిడ్నాప్, అపహరణ కేసులు నమోదు కాగా..2023లో ఆ సంఖ్య 3,174గా ఉన్నట్టు ఎన్‌సీఆర్‌బీ 2024 నివేదిక స్పష్టం చేసింది.
2022 నుంచి 2024 వరకు దేశంలో రాష్ట్రాలవారీగా నమోదైన నేరాలు
రాష్ట్రం పేరు 2022 2023 2024
యూపీ 4,01,787 4,28,794 4,30,552
మహారాష్ట్ర 3,74,038 3,85,623 3,83,044
మధ్యప్రదేశ్ 2,98,578 2,97,689 2,82,874
బిహార్ 2,11,079 2,31,627 2,38,753
రాజస్థాన్ 2,36,090 2,34,985 2,13,352
తమిళనాడు 1,93,913 2,03,804 1,97,149
తెలంగాణ 1,51,849 1,56,737 1,90,704
ఏపీ 1,58,547 1,53,867 1,16,076
సైబర్ నేరాలు ( మొదటి ఐదు రాష్ట్రాలు )
తెలంగాణ 15,297 18,236 27,230
కర్నాటక 12,556 21,889 21,993
ఉత్తర్ ప్రదేశ్ 10,117 10,794 11,073
మహారాష్ట్ర 8,249 8,103 9,922
బిహార్ 1,621 4,450 6,380
మొత్తం 65,893 86,420 1,01,928
