తెలంగాణలో నేరాలు పెరిగినయ్.. హత్యలు, మహిళలపై దాడులు పెరిగినయ్

తెలంగాణలో నేరాలు పెరిగినయ్.. హత్యలు, మహిళలపై  దాడులు పెరిగినయ్
  •     నిరుడు 1.65 లక్షల కేసులు నమోదు
  •     పెరిగిన సైబర్ క్రైమ్స్, మహిళలపై దాడులు
  •     2022 క్రైమ్ డేటా వెల్లడించిన ఎన్​సీఆర్​బీ

హైదరాబాద్‌‌, వెలుగు : 2021తో పోలిస్తే.. 2022లో రాష్ట్ర వ్యాప్తంగా నేరాలు పెరిగినట్లు నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్​సీఆర్​బీ) సోమవారం ప్రకటించింది. తీవ్రమైన, సాధారణ నేరాలు, మహిళలపై దాడులు, సైబర్ క్రైమ్స్ ప్రతి ఏటా పెరుగుతున్నట్లు వెల్లడించింది. 2‌‌‌‌021లో రాష్ట్ర వ్యాప్తంగా 1,58,809 కేసులు నమోదు కాగా, 2022లో 1,65,830 కేసులు రిజిస్టర్ అయినట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్స్ 24.40 శాతం పెరిగినట్లు ప్రకటించింది. సైబర్ క్రైమ్ కేసుల్లో బెంగళూరు ఫస్ట్​ ప్లేస్ ఉంటే.. హైదరాబాద్ సెకండ్ ప్లేస్​లో ఉన్నట్లు ఎన్​సీఆర్​బీ తెలిపింది. మహిళలపై నేరాలు కూడా పెరిగాయని చెప్పింది. మూడేండ్ల కాలంలో దేశ వ్యాప్తంగా నమోదైన కేసుల వివరాలను ఎన్​సీఆర్​బీ సోమవారం విడుదల చేసింది. 2021లో రాష్ట్ర వ్యాప్తంగా మహిళపై జరిగిన అన్ని రకాల దాడులకు సంబంధించి 20,865 కేసులు నమోదు కాగా, 2022లో 22,066 కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఇందులో అత్యాచారానికి సంబంధించి 814 కేసులు, చిన్నారులపై నేరాలకు సంబంధించి 5,657 కేసులు ఉన్నాయి. వివిధ కారణాలతో మొత్తం 968 మర్డర్ కేసులు రిజిస్టర్ అయ్యాయి.

2022లో 968 హత్యలు

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరిగిన హత్యలు, అత్యాచారాలు, దొంగతనాలు, కిడ్నాప్​లు, మహిళలపై వేధింపులు, యాసిడ్ దాడులు, రోడ్డు ప్రమాదాలు, సైబర్ క్రైమ్‌‌ సహా పోలీస్‌‌ స్టేషన్స్‌‌లో నమోదైన కేసుల వివరాలను నివేదికలో ఎన్​సీఆర్​బీ వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్రాల వారీగా అందిన క్రైమ్ రికార్డులను వెబ్‌‌సైట్‌‌లో అప్​లోడ్ చేసింది. ఎన్‌‌సీఆర్‌‌‌‌బీ వెల్లడించిన నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా 58,24,946 కేసులు నమోదయ్యాయి. వీటి నుంచి రాష్ట్రంలో 1,65,830 కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఇందులో 1,096 కేసుల్లో మైనర్లు నిందితులుగా ఉన్నారు. 2021లో రాష్ట్రంలో 1,026 మర్డర్ హత్య కేసులు నమోదు కాగా, 2022లో 968 హత్యలు జరిగాయి.

మహిళలపై నేరాలు పెరిగినయ్..

మహిళలపై నేరాల సంఖ్య పెరిగింది. గతేడాది 814 అత్యాచారం కేసులు నమోదు కాగా, వరకట్నపు వేధింపులతో 44 మంది మహిళలు హత్యకు గురయ్యారు. ఇవే కాకుండా, 41 వ్యక్తిగత కక్షలు, 3 పరువు హత్యలు, 14 ప్రేమ వ్యవహారాలు, 116 అక్రమ సంబంధం కారణంగా హత్యలు జరిగాయి. కిడ్నాప్‌‌ కేసులు 2021లో 2,760 నమోదు కాగా, గతేడాది 2,981కు పెరిగాయి. వీటితో పాటు మహిళలపై జరుగుతున్న దాడుల సంఖ్య పెరిగిపోతున్నది. ఆన్‌‌లైన్‌‌ వేధింపులు గణనీయంగా పెరిగిపోయాయి. హైదరాబాద్‌‌లో గతేడాది 79 మర్డర్ కేసులు నమోదయ్యాయి. 2021లో రాష్ట్ర వ్యాప్తంగా 10,303 సైబర్ క్రైమ్ కేసులు నమోదు కాగా, 2022లో 15,297 కేసులు రిజిస్టర్ అయ్యాయి. 2022లో హైదరాబాద్‌‌లోనే 4,436 సైబర్ క్రైమ్ కేసులు రిజిస్టర్ అయ్యాయి.