
న్యూఢిల్లీ: కల్నల్ సోఫియా ఖురేషిపై మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ మంత్రి విజయ్ షా చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ ఇష్యూపై జాతీయ మహిళ కమిషన్ స్పందించింది. మంత్రి విజయ్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. భారత సాయుధ దళాలలో పనిచేస్తున్న మహిళల పట్ల గౌరవం చూపించాలని చురకలంటించింది. ఈ మేరకు జాతీయ మహిళ కమిషన్ చైర్ పర్సన్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రియాక్ట్ అయ్యారు.
బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇలాంటి ప్రకటనలు చేయడం చాలా దురదృష్టకరమని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తరహా వ్యాఖ్యలు మహిళల పట్ల అవమానకరమైనవి, ఆమోదయోగ్యం కానివన్నారు. ఈ వ్యాఖ్యలు మన సమాజంలోని మహిళల గౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా, జాతీయ భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్న దేశ కుమార్తెలను కూడా అవమానించేవని అభిప్రాయపడ్డారు. కల్నల్ ఖురేషి ధైర్యవంతమైన నిబద్ధత గల అధికారి అని.. ఆమెను దేశవ్యాప్తంగా ఆరాధిస్తారని పేర్కొన్నారు.
సోఫియా వంటి ధైర్యవంతమైన మహిళలకు భారత్ ఎల్లప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. సోఫియా ఖురేషి దేశానికి గర్వకారణమైన ఆడబిడ్డ.. ఆమె ప్రతి దేశభక్తిగల భారతీయుడికి సోదరి లాంటిదన్నారు. దేశ కోసం ఎంతో అంకితభావంతో పని చేసిన ఆమెపై ఇటువంటి అవమానకరమైన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాలని పిలుపునిచ్చారు.
పహల్గాం టెర్రరిస్ట్ ఎటాక్‌కు కౌంటర్‌గా భారత్ చేసిన ఆపరేషన్ సిందూర్ తర్వాత కల్నల్ సోఫియా ఖురేషి ట్రెండింగ్‌లోకి వచ్చారు. ఆమె నేరుగా దాడుల్లో పాల్గొననప్పటికీ.. ఆపరేషన్ సిందూర్ గురించి మీడియాకు వివరించిన త్రివిధ దళాల బృందంలో కల్నల్ ఖురేషి ఒకరు. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌లతో కలిసి ఖురేషి ఆపరేషన్ గురించి మీడియాకు బ్రీఫింగ్ చేశారు.
పహల్గాంలో దాడి చేసి భారత ఆడబిడ్డల నుదుట సిందురాన్ని తుడిచేసిన ఉగ్రవాదులపై భారత్ రివేంజ్ తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసి దాదాపు 100 మందిని మట్టుబెట్టింది. ఉగ్రవాదులు భారత ఆడబిడ్డల సిందురాన్ని తుడిచేస్తే.. అదే మహిళలతో ఉగ్రవాదులను అంతమొందించిన వివరాలను ప్రపంచానికి చెప్పించింది భారత్. ఆపరేషన్ సిందూర్ తర్వాత నుంచి కల్నల్ ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యారు.
ఈ క్రమంలో దేశం మొత్తం ఆరాధిస్తోన్న కల్నల్ ఖురేషిపై మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ మంత్రి విజయ్ షా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఉగ్రవాదులు మా కూతుళ్ల నుదుటిపై ఉన్న సిందూరాన్ని తుడిచేస్తే.. ఆ ఉగ్రమూకలకు గుణ పాఠం చెప్పేందుకు ప్రధాని మోడీ వారి కమ్యూనిటికి చెందిన సోదరినే పంపారు అని కామెంట్ చేశారు. దీంతో మంత్రి వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.