ప్రెసిడెంట్‌‌ పీఠంపై ద్రౌపది ముర్ము

ప్రెసిడెంట్‌‌ పీఠంపై ద్రౌపది ముర్ము

కనీస పోటీ ఇవ్వలేకపోయిన ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా
64 శాతం ఓట్లు దక్కించుకున్న ముర్ము.. లెక్కింపులో మూడో రౌండ్‌‌కే గెలుపు ఖరారు
15వ ప్రెసిడెంట్‌‌గా 25న ప్రమాణస్వీకారం
అభినందనలు తెలిపిన ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని, సీఎంలు

న్యూఢిల్లీ/హైదరాబాద్​, వెలుగు : ఆదివాసీ ముద్దుబిడ్డ కొత్త చరిత్ర సృష్టించారు. దేశ అత్యున్నత పదవికి ఎన్నికయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల్లో 64 శాతం పైగా ఓట్లు సాధించి ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించారు. ఏకపక్షంగా సాగిన ఎన్నికలో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఎక్కడా పోటీ ఇవ్వలేకపోయారు. ముర్ము గెలుపు ఖరారు కాగానే ప్రధాని మోడీ మొదలు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఇతర రాజకీయ పార్టీల నేతల నుంచి ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇండియా 15వ ప్రెసిడెంట్‌‌గా ఈనెల 25న ముర్ము ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఇటు లెక్కింపు.. అటు సంబురాలు
ఈనెల 18న రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ జరిగింది. గురువారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్ హౌస్‌‌లోని రూమ్‌‌ నంబర్ 63లో కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. మధ్యాహ్నం 1.30 ఓట్ల లెక్కింపును ఆఫీసర్లు ప్రారంభించారు. తొలి రౌండ్‌‌లో లోక్‌‌సభ, రాజ్యసభ ఎంపీల ఓట్లు లెక్కించారు. తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌‌‌‌లో రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓట్లు లెక్కించారు. ఇటు కౌంటింగ్‌‌ జరుగుతుండగానే ఢిల్లీలోని రాజ్‌‌పథ్‌‌లో బీజేపీ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి. ముర్ము సొంతూరు రాయ్‌‌రంగ్‌‌పూర్‌‌‌‌లోనూ ప్రజలు వేడుకల్లో మునిగిపోయారు. ముర్ముకు 53.13 శాతం ఓట్లు పడినట్లు మూడో రౌండ్‌‌లోనే రిటర్నింగ్‌‌ ఆఫీసర్ ప్రకటించడంతో.. యశ్వంత్ సిన్హా తన ఓటమిని ఒప్పుకున్నారు. మెజారిటీ ఎంత అనేది తెలుసుకునేందుకు నాలుగో రౌండ్ దాకా ఎదురుచూడాల్సి వచ్చింది.

15 మంది ఎంపీల ఓట్లు చెల్లలే
ముందుగా తొలి రౌండ్‌‌లో లోక్‌‌సభ, రాజ్యసభ సభ్యుల ఓట్లను లెక్కించారు. 748 మంది (వ్యాలిడ్) ఓటేయగా.. ఇందులో 540 మంది ఓట్లు ముర్ముకు పడ్డాయి. వీటి విలువ 5,23,600. అంటే దాదాపు 72 శాతం మంది ముర్ముకు ఓటేశారు. యశ్వంత్‌‌ సిన్హాకు 208 మంది ఓటు వేశారు. వీటి విలువ 1,45,600. మొత్తం ఓట్లలో 27.81 శాతం. ఇక 15 మంది ఎంపీల ఓట్లు చెల్లనివిగా రిటర్నింగ్ ఆఫీసర్ పీసీ మోడీ ప్రకటించారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి ముర్ముకు ఎక్కువ ఓట్లు పడగా.. బెంగాల్, తమిళనాడు నుంచి యశ్వంత్​ సిన్హాకు ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఆంధ్రప్రదేశ్, సిక్కిం నుంచి మొత్తం ఓట్లన్నీ ముర్ముకే పడ్డాయి. 

స్టేట్​ ఆఫీసులో బీజేపీ సంబురాలు
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం సాధించడంతో బీజేపీ ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో గురువారం రాత్రి పార్టీ స్టేట్ ఆఫీసు ముందు నాయకులు, కార్యకర్తలు, గిరిజనులు, ఆదివాసీలు పెద్ద ఎత్తున సంబురాలు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని  జిల్లా పార్టీ కార్యాలయాలతో పాటు ఆదివాసీ, గిరిజన తండాలు, గూడెంలలో బీజేపీ ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు వేడుకల్లో మునిగితేలారు. పలు చోట్ల ద్రౌపది ముర్ము ఫొటోతో ఊరేగింపులు, బైక్ ర్యాలీలు నిర్వహించారు. బీజేపీ స్టేట్ ఆఫీసు వద్ద జరిగిన సంబురాల్లో మాజీ ఎంపీ రవీంద్ర నాయక్,  పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ రావుతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ  సందర్భంగా రవీంద్ర నాయక్ మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎవరూ ఊహించని విధంగా గిరిజన మహిళను దేశ ప్రథమ పౌరురాలిగా చేసిన ఘనత బీజేపీకే దక్కిందన్నారు. గిరినులకు ఉన్నతమైన రాజకీయ అవకాశాలు కల్పిస్తున్న పార్టీ బీజేపీ మాత్రమే అని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ చెప్పిన పనులే చేయరని, కానీ ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం చెప్పని పనులు కూడా చేసి చూపిస్తున్నారని కొనియాడారు. గిరిజనులను కేసీఆర్​తన ఓటు బ్యాంక్ గా మాత్రమే చూస్తున్నారని, ఖమ్మంలో గిరిజన రైతులకు బేడీలు వేసిన చరిత్ర కేసీఆర్ సర్కార్ దని ధ్వజమెత్తారు. గిరిజనులకు రావాల్సిన నిధులను కాళేశ్వరానికి తరలించారని ఆరోపించారు.  ఆదివాసీ గిరిజన జాతి మొత్తం బీజేపీకి మద్దతు పలకాలని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ చరిత్రలో గుర్తుంచుకునే రోజు 21 జూలై 2023 అని అన్నారు. దేశ ప్రథమ పౌరురాలిగా గిరిజన మహిళ విజయం సాధించడం సంతోషకరమన్నారు. గిరినులను రాజకీయంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయికి తీసుకుపోతున్న పార్టీ బీజేపీ అని చెప్పారు. గిరిజన మహిళకు రాష్ట్రపతి ఎన్నికల్లో  మద్దతు ఇవ్వని పార్టీ టీఆర్ఎస్ అని, దేశ చరిత్రలోనే ఆ పార్టీ గిరిజన ద్రోహిగా మిగిలిపోతుందన్నారు. 

17 మంది ఎంపీలు, 125 మంది ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్!
రాష్ట్రపతి ఎన్నికలో పార్టీలు విప్ జారీ చేసేందుకు అవకాశం లేకపోవడంతో.. పలు పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు క్రాస్‌‌ ఓటింగ్‌‌కు పాల్పడ్డారు. తమ పార్టీలు బలపరిచిన యశ్వంత్ సిన్హాకు బదులుగా 17 మంది ఎంపీలు, 125 మంది ఎమ్మెల్యేలు ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఓటేసినట్లు తెలుస్తున్నది. ఇందులో ప్రతిపక్ష యూపీఏలోని పార్టీల ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. ఎక్కువగా అస్సాం, మధ్యప్రదేశ్ నుంచి క్రాస్ ఓటింగ్ నమోదైనట్లు సమాచారం. అస్సాంలో 22 మంది, మధ్యప్రదేశ్‌‌లో 20 మంది, గుజరాత్‌‌లో 10 మంది, బీహార్, చత్తీస్‌‌గఢ్‌‌లో ఆరుగురు చొప్పున, గోవాలో నలుగురు క్రాస్ ఓటింగ్‌‌ చేసినట్లు తెలుస్తున్నది. జార్ఖండ్‌‌లోనూ ఎక్కువగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు సమాచారం. నిజానికి సొంత బలంతోనే ముర్ముకు విజయం ఖరారు కాగా, క్రాస్ ఓటింగ్ వల్ల మెజారిటీ మరింత పెరిగింది.

టీచర్‌‌ నుంచి మొదలై..
న్యూఢిల్లీ: ద్రౌపది ముర్ము.. ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టి.. ప్రభుత్వ ఉద్యోగంతో జీవితం మొదలుపెట్టి.. కౌన్సిలర్‌‌‌‌గా.. మంత్రిగా.. గవర్నర్‌‌‌‌గా.. ఇప్పుడు ప్రెసిడెంట్‌‌గా ఒక్కో మెట్టు ఎక్కుతూ అత్యున్నత స్థాయికి ఎదిగారు. అధికారం చేతిలో ఉన్నా నిరాడంబర జీవితం గడిపారు. 1958 జూన్ 20న ఒడిశాలోని మయూర్‌‌భంజ్ జిల్లా బైడపోసిలో ద్రౌపది ముర్ము జన్మించారు. భువనేశ్వర్‌‌లోని రమాదేవి ఉమెన్స్‌‌ కాలేజీ నుంచి బీఏ పూర్తి చేశారు. ఒడిశా నీటిపారుదల, విద్యుత్‌‌ శాఖలో 1979 నుంచి 1983 దాకా జూనియర్‌‌ అసిస్టెంట్‌‌గా పనిచేశారు. తర్వాత రాయ్‌‌రంగ్‌‌పూర్‌‌‌‌లోని శ్రీ అరబిందో ఇంటెగ్రల్ ఎడ్యుకేషన్ సెంటర్‌‌‌‌లో గౌరవ అసిస్టెంట్ టీచర్‌‌‌‌గా 1997 దాకా కొనసాగారు. సంతలి, ఒడియా భాషల్లో అనర్గలంగా మాట్లాడగల వక్త.

బెస్ట్ ఎమ్మెల్యే
సంతాల్ కమ్యూనిటీకి చెందిన ద్రౌపది ముర్ము.. శ్యామ్ చరణ్ ముర్మును వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. 1997లో మయూర్‌‌భంజ్ జిల్లాలోని రాయ్‌‌రంగ్‌‌పూర్‌‌‌‌ నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్‌‌కు జరిగిన ఎన్నికల్లో బీజేపీ నుంచి కౌన్సిలర్‌‌‌‌గా ఎన్నికయ్యారు. తర్వాత మూడేండ్లలోనే ఒడిశాలో బీజేడీ-‌‌–బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. రాయ్‌‌రంగ్‌‌పూర్ నియోజకవర్గం నుంచే 2000వ సంవత్సరంలో ఎమ్మెల్యేగా గెలిచి.. 2000 నుంచి 2004 దాకా మంత్రి పదవిలో కొనసాగారు. వాణిజ్య, రవాణా శాఖ, మత్స్యశాఖ, పశు సంవర్థల శాఖలను చూశారు. 2007లో ఒడిశా అసెంబ్లీ.. ‘బెస్ట్ ఎమ్మెల్యే ఆఫ్‌‌ ది ఇయర్‌‌‌‌’గా ముర్మును ప్రకటించి, నీల్‌‌కాంత్ అవార్డుతో సత్కరించింది. తర్వాత ఒడిశా బీజేపీ గిరిజన మోర్చాకు ఉపాధ్యక్షురాలిగా, అధ్యక్షురాలిగా చేశారు. 2010, 2013ల్లో మయూర్‌‌భంజ్‌‌జిల్లా బీజేపీ విభాగం ప్రెసిడెంట్‌‌గా నియమితులయ్యారు. బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ ఎగ్జిక్యూటివ్‌‌ సభ్యురాలిగా చేశారు.

భర్తను, కొడుకులను పోగొట్టుకుని..
2009లో ముర్ము పెద్ద కొడుకు అనుమానస్పద స్థితిలో చనిపోయాడు. 2012లో జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండో కొడుకు మరణించాడు. 2014లో భర్త శ్యామ్‌‌ చరణ్‌‌ గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. 2009- – 2015 మధ్య ఆరేండ్లలో తన భర్త, ఇద్దరు కొడుకులు, తల్లి, సోదరుడిని కోల్పోయారు. తర్వాత బ్రహ్మ కుమారీలతో కలిసిపోయి ధ్యాన పద్ధతులను నేర్చుకున్నారు. 2014 ఎన్నికల్లో రాయ్‌‌రంగ్‌‌పూర్‌‌‌‌ అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేసిన ముర్ము.. బీజేడీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 2015 ఏప్రిల్‌‌లో మయూర్‌‌‌‌భంజ్‌‌ జిల్లా అధ్యక్షురాలిగా ఉండగానే.. జార్ఖండ్‌‌ గవర్నర్‌‌‌‌గా ద్రౌపది ముర్ము నియమితులయ్యారు. జార్ఖండ్‌‌కు తొలి మహిళ, గిరిజన గవర్నర్‌‌గా ప్రమాణ స్వీకారం చేశారు. 2021 దాకా ఆ పదవిలో కొనసాగారు. గవర్నర్‌‌‌‌గా పదవీకాలం పూర్తయ్యాక తిరిగి రాయ్‌‌రంగ్‌‌పూర్‌‌‌‌లో ధ్యానం, సామాజిక కార్యక్రమాల్లో మునిగిపోయారు.