రాజ్యసభలోనూ ఎన్డీయే రాజ్యమే

రాజ్యసభలోనూ ఎన్డీయే రాజ్యమే
  • మెజారిటీ దిశగా కాషాయ కూటమి

లోక్​సభ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించిన ఎన్డీయే అధికారాన్ని నిలబెట్టుకుంది. అయితే లోక్ సభలో 300 మందికిపైగా ఎంపీలున్నా, రాజ్యసభలో తగినంత మంది సభ్యులు లేరు. దీంతో కీలకమైన బిల్లులు ఆమోదించుకునేందుకు ఇబ్బందులు పడింది. ఎన్డీయేతర పార్టీలను బుజ్జగించి కొన్ని బిల్లులు ఆమోదించుకుంది. కొన్ని బిల్లులు పెండింగ్​లో ఉండిపోయాయి. గత ఐదేళ్లూ అలానే నడిచింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పెద్దల సభలో ‘మైనారిటీ స్టేటస్’​తోనే నెట్టుకొచ్చింది. ఇప్పుడు మెజారిటీ దిశగా సాగుతోంది. ట్రిపుల్ తలాక్ చట్టం, మోటార్ వెహికల్స్ యాక్ట్, సిటిజన్ షిప్ చట్టానికి సవరణ.. తదితర బిల్లులను ఆమోదించే బలం సంపాదించుకుంటోంది.

కాంగ్రెస్​ను దాటింది…

రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుల కంటే బీజేపీ సభ్యులు ఎప్పూడు తక్కువే. చరిత్రలో తొలిసారిగా గతేడాది హస్తం పార్టీని బీజేపీ దాటేసింది. మొత్తం 245 సీట్లలో, 101 సీట్లు ఉన్న పార్టీగా తొలిస్థానంలో నిలిచింది. ముగ్గురు నామినేటెడ్ ఎంపీలు స్వపన్ దాస్​గుప్తా, మేరీకోమ్, నరేంద్ర జాధవ్​తోపాటు మరో ముగ్గురు ఇండిపెండెంట్ ఎంపీలతో కలిపి ఎన్డీయే బలం 107 సీట్లకు చేరింది. యూపీఏ నామినేటెడ్ మెంబర్ కేటీఎస్ తులసి పదవీకాలం వచ్చే ఏడాది ప్రారంభంలో పూర్తి కానుంది. ఈ సీటులోనూ ఎన్డీయే తమకు నచ్చిన వ్యక్తిని నామినేట్ చేయనుంది.

మరో 19 సీట్లు…

వచ్చే ఏడాది నవంబర్ కల్లా ఉత్తరప్రదేశ్, బీహార్, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్ సహా 14 రాష్ర్టాల్లోని 19 సీట్లు ఎన్డీయే ఖాతాలోకి చేరనున్నాయి. దీంతో ఎన్డీయేకు స్పష్టమైన మెజారిటీ దక్కనుంది. ఈ 19 సీట్లలో ఎక్కువగా యూపీ నుంచి రానున్నాయి. అక్కడ బీజేపీకి 310 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. తమిళనాడులో మిత్రపక్షం ఏఐఏడీఎంకే  సాయంతో ఆరు సీట్లు, అస్సాంలో మూడు, రాజస్థాన్​లో 2, ఒడిశా నుంచి 1 సీటు దక్కనుంది. కర్నాటక, మిజోరం, మేఘాలయ, హిమాచల్​ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ర్టాల నుంచి ఒక్కో సీటు రానుంది. తద్వారా పెద్దల సభలో గత 15 ఏళ్లలో మెజారిటీ సభ్యులు ఉన్న తొలి ప్రభుత్వంగా రికార్డు సృష్టించనుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీ.. రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్, చత్తీస్​గఢ్ తదితర రాష్ర్టాల్లోని కొన్ని సీట్లను కోల్పోనుంది. 2020 నవంబర్ నాటికి రాజ్యసభలో ఎన్డీయే మెజారిటీ మార్క్ ను దాటుతుంది. ఒక్కసారి మెజారిటీ వచ్చాక, కనీసం మరో నాలుగేళ్లపాటు తమ ఎజెండాను అమలు చేయనుంది. ఇప్పటి నుంచి 2020 నవంబర్ వరకు 75 రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరుగుతాయి.

అధికారంలో ఉన్నా ‘అమలు’ చేయలేక…

ఐదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే.. తాము తీసుకొచ్చిన బిల్లులను చట్టాలుగా మార్చలేకపోయింది. ఇది బీజేపీకి పెద్ద తలనొప్పిగా మారింది. భూ సేకరణ చట్టానికి సవరణలు చేస్తూ తీసుకొచ్చిన బిల్లును.. ఎన్డీయేతర పక్షాలన్నీ కలిసి అడ్డుకున్నాయి. ‘ట్రిపుల్ తలాక్’​ బిల్లుపై కనీసం చర్చించేందుకు కూడా ప్రతిపక్షం ఒప్పుకోకపోవడంతో.. అది చట్టరూపం దాల్చేలేదు.

బలం చూపెట్టిన ప్రతిపక్షం…

రాజ్యసభలో ప్రతిపక్షం తన బలాన్ని చూపెట్టిన సందర్భమిది. 2016లో రాష్ర్టపతి చేసిన ప్రసంగంలో మార్పులు సూచిస్తూ ప్రతిపక్షం సవరణలు చేసింది. దాన్ని రాజ్యసభ ముందుంచింది. ఓటింగ్‌‌కు అనుమతి ఇవ్వొద్దని నాటి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య సూచించినా డిప్యూటీ చైర్మన్‌‌ కురియన్‌‌ పట్టించుకోలేదు. పలువురు కేంద్ర మంత్రుల సూచనలనూ ఖాతరు చేయలేదు. అపోజిషన్ పెట్టిన సవరణపై ఓటింగ్‌‌కు అనుమతిచ్చారు. ప్రతిపక్షానికి అనుకూలంగా 94, వ్యతిరేకంగా 61 ఓట్లు పడ్డాయి. దీంతో సవరణలను రాజ్యసభ ఆమోదించినట్లయింది. రాష్ట్రపతి ప్రసంగానికి సవరణ సూచిస్తూ ఓటింగ్‌‌ కోరడం, దాన్ని ఆమోదించడం చాలా అరుదైన ఘటన. అధికార పక్షానికి అవమానకరమైన సంఘటన.