రేపే రాష్ట్రపతి ఎన్నికలు

రేపే రాష్ట్రపతి ఎన్నికలు

రేపు రాష్ట్రపతి ఎన్నికలకు అంతా రెడీ అయింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. ఎంపీలు పార్లమెంట్ లో, ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీలో ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్ భవనంలో ఎన్డీయే కూటమి పక్షాల  సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపతి ముర్ము హాజరయ్యారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్మును జెపి నడ్డా సన్మానించారు. 

ఎన్నిక ప్రక్రియ.. 

రేపు జరగనున్న రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన ఓటింగ్ బ్యాలెట్ పేపర్ విధానంలో జరుగుతుంది. ఓటింగ్ సమయంలో వాడే పెన్నును కేంద్ర ఎన్నికల సంఘమే ఇస్తుంది. వేరే పెన్నుతో వేసే ఓటు రద్దవుతుంది. రాష్ట్రపతి ఎన్నిక కోసం పార్టీలు తమ ఎంపీలు, ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయకూడదు. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో లోక్ సభ, రాజ్యసభ సభ్యులు, అన్ని రాష్ట్రాలు, యూటీల ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉంటారు. తెలంగాణకు చెందిన 119 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీలు కూడా ఎన్నికలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్రపతి ఎన్నిక ఫలితాలు ఈనెల 21న వెలువడనున్నాయి. భారత నూతన రాష్ట్రపతి ఈనెల 25న ప్రమాణ స్వీకారం చేస్తారు.  

వరంగల్ ప్రజాప్రతినిధులతో కలిసి కేసీఆర్..

భద్రాచలం, ఏటూరునాగారం పర్యటన ముగించుకున్న సీఎం కేసీఆర్ ఇవాళ రాత్రి హన్మకొండలోని కెప్టెన్ లక్ష్మీ కాంతారావు నివాసంలో బస చేయనున్నారు.  రేపు రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఉదయాన్నే జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లనున్నారు.