- రాష్ట్రంలోని డ్యాముల పరిస్థితిపై ఈఎన్సీలతో మీటింగ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని డ్యాముల పరిస్థితిపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) దృష్టి సారించింది. అన్ని ప్రాజెక్టులపైనా కాంప్రహెన్సివ్ డ్యామ్ సేఫ్టీ ఎవాల్యుయేషన్(సీడీఎస్ఈ) నిర్వహించాలని అక్టోబర్17న సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ లేఖ రాశారు. 2026 డిసెంబర్‌ను డెడ్‌లైన్‌గా పెట్టారు.
ఈ క్రమంలోనే డ్యాములకు సీడీఎస్ఈ నిర్వహించేలా అధికారులకు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్న దానిపై తెలుసుకునేందుకు ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ గురువారం హైదరాబాద్‌కు వస్తున్నారు. ఈఎన్సీలతో సమావేశం కానున్నారు. సింగూరు డ్యామ్ సహా రాష్ట్రంలోని మేజర్, మీడియం ప్రాజెక్టుల పరిస్థితిని తెలుసుకోనున్నారు. కాగా, డ్యాముల భద్రతకు సంబంధించి 2021లోనే కేంద్ర ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్‌ను తీసుకొచ్చింది.
అన్ని డ్యాములకూ సీడీఎస్ఈ రికార్డులను 2026 నాటికి తయారు చేయాలని ఆ ఏడాదే చెప్పినా.. ఇప్పటివరకూ ఏ రాష్ట్రం నుంచీ స్పందన లేదు. ఈ క్రమంలోనే డ్యామ్ సేఫ్టీని కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. అందులో భాగంగానే తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలకూ సీడీఎస్ఈ రికార్డులను తయారు చేయాలంటూ కేంద్రం లేఖలు రాసింది.
రాష్ట్రాలు చేయాల్సింది ఇదీ..
1. డ్యామ్ రిస్క్ అసెస్మెంట్ స్టడీ: డ్యాముల ప్రస్తుత పరిస్థితితో పాటు గతంలో ఆ డ్యామ్‌కు జరిగిన ప్రమాదం లేదా రాబోయే ప్రమాదాలకు సంబంధించి విశ్లేషించాలి. డ్యామ్ కరకట్టలు, గేట్లు, ఇతర నిర్మాణాల పటిష్టతపై అధ్యయనం చేయాలి.
2. ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్: డ్యామ్‌లకు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే చేపట్టాల్సిన చర్యలపై కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలి. అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలన్న దానిపై మాన్యువల్‌ను ప్రిపేర్ చేయాలి.
3. సీడీఎస్ఈ: ప్రతి డ్యామ్‌కు డిజిటల్ లాగ్‌బుక్‌లు, డేటాబేస్లను తయారు చేసి పెట్టుకోవాలి. డ్యామ్ పేరు, కవర్‌పేజీతో పాటు ఆ డ్యామ్ లొకేషన్ వివరాలను పొందుపరచాలి. డ్యామ్ ప్రయోజనాలు, దాని ఉద్దేశం వంటి వివరాలను డిజిటల్‌గా రికార్డు చేయాలి. ఆపరేషన్ ప్రొటోకాల్, డ్యామ్ ఎత్తు, గేట్ల సంఖ్య, హెడ్ రెగ్యులేటరీలు, ప్రధాన కాల్వలు, విద్యుత్ ప్రాజెక్టుల వంటి వివరాలనూ రికార్డు చేయాలి.

