ఉపాధి కావాలి..ఓటర్ల అభిప్రాయం

ఉపాధి కావాలి..ఓటర్ల అభిప్రాయం

ఉపాధి అవకాశాలే తమకు టాప్‌ ప్రయార్టీ అని రాష్ట్ర ఓటర్లు అంటున్నారు. సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు, వ్యవసాయానికి సాగునీరు,గిట్టు బాటు ధర కూడా కావాలని కోరుతున్నారు. అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌) నిర్వహించిన ఓ సర్వేలో ఇది వెల్లడైంది. దేశవ్యాప్తంగా గత ఏడాది అక్టోబర్​– డిసెంబర్‌ మధ్య సంస్థ సర్వే చేపట్టింది. రెండురోజుల క్రితం ఢిల్లీలో నివేదికను విడుదల చేసిం ది. లోక్​సభ ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలను సిద్ధం చేసుకుం టున్న తరుణంలో ఏడీఆర్‌ నివేదిక ఆసక్తి కలిగిస్తోంది. పాలనాపరమైన అంశాలు, ప్రభుత్వాల పనితీరు, ఓటర్ల ఆలోచనను ప్రభావితం చేసే అంశాలు వంటి 31 అంశాలపై 534 లోక్‌సభ సెగ్మెం ట్లల్లో 2,73,487 మంది ఓటర్ల నుంచి సంస్థ అభిప్రాయాలను సేకరించిం ది. మన రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల పరిధిలో సర్వేకొనసాగింది.

65.99% మందిది ఒకటే మాట….

తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో నూ మెజార్టీ ఓటర్లు మెరుగైన ఉపాధి అవకాశాలకే జైకొట్టారు. దేశవ్యాప్తంగా సగటున 56.67 శాతం మంది ఉపాధి,ఉద్యోగ అవకాశాలను కోరగా, ఇది తెలంగాణలో 65.99 శాతంగా ఉంది. రాష్ట్రంలోని 15 నియోజకవర్గా ల ఓటర్లు ఉపాధి అవకాశాలకే మొదటి ప్రాధాన్యం ఇచ్చారు. అందులో ఆదిలాబాద్‌ లోక్‌సభ పరిధిలో 70.20 శాతం మంది, చేవెళ్లలో 73.43, హైదరాబాద్‌లో 67.84, కరీం నగర్‌లో 63.24,మహబూబాబాద్‌లో 62.23, మహబూబ్ నగర్‌లో 71.67, మల్కాజ్ గి రిలో 74.40, మెదక్‌లో 65.50, నాగర్‌కర్నూల్ లో 70.22, నల్గొం డలో 71.37, నిజామాబాద్‌లో 66.16, పెద్దపల్లిలో 66.44, సికింద్రాబాద్​లో 79.00, వరంగల్ లో 59.20, జహీరాబాద్‌లో 66.04 శాతం మంది ఉన్నారు. అలాగే ఉపాధి అవకాశాల కల్పనలో ప్రభుత్వాల పనితీరు పేలవంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమైంది.

వ్యవ‘సాయం’ కావాలి…

దేశవ్యాప్తంగా మెజార్టీ ఓటర్లు రెండు, మూడో ప్రయార్టీలను వరుసగా వైద్యం , తాగునీటికి ఇవ్వగా, మనరాష్ట్రంలోని మెజార్టీ ఓటర్ల ప్రయార్టీ మాత్రం వ్యవసాయంపై ఉంది. సర్వేలో అభిప్రాయాలు చెప్పిన భువనగిరి ఓటర్లు సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల పంపిణీకి (48.20 శాతం) టాప్‌ ప్రయార్టీ ఇచ్చి, సాగునీటి సౌకర్యం (38.30 శాతం),పంటకు గిట్టు బాటు ధర (37.87శాతం) కల్పించడం తమకు రెండు, మూడో ప్రయార్టీలని చెప్పారు.ఖమ్మం లోక్‌సభ పరిధిలోని ఓటర్లు పంటలకు గిట్టు బాటు ధర (50 శాతం)ను తమ టాప్‌ ప్రయార్టీ అని,సాగునీటి సౌకర్యం (48శాతం), సబ్సిడీలో విత్తనాలు,ఎరువులు, పురుగు మందుల పంపిణీ(46.79శాతం) రెండు, మూడో ప్రాధాన్యాం శాలని అభిప్రాయపడ్డారు. ఆదిలాబాద్‌, చేవెళ్ల, కరీం నగర్‌, మహబూబాబాద్‌, మెదక్‌, నాగర్‌కర్నూల్‌, నల్గొం డ, నిజామాబాద్‌, పెద్దపల్లి, వరంగల్‌, జహీరాబాద్‌ పరిధిలో వ్యవసాయానికి సంబంధిం చిన అంశాలు రెండు, మూడో ప్రయార్టీలుగా సర్వేలో వెల్లడైంది.

కాలుష్యాన్ని నియంత్రించాలంటున్న అర్బన్‌ ఓటర్లు….

రాష్ట్రంలోని అర్బన్‌ ఓటర్లు రెండో ప్రాధాన్యాంశంగా శబ్ద కాలుష్య నియంత్రణ, మూడో ప్రాధాన్యాంశంగా వాయు, జల కాలుష్య నియంత్రణగా పేర్కొన్నారు. వీటిల్లో హైదరాబాద్, సికిం ద్రాబాద్‌, మల్కాజ్ గిరి, చేవెళ్ల, జహీరాబాద్‌, కరీం నగర్‌, ఆదిలాబాద్‌ సెగ్మెంట్లు ఉన్నాయి. సికిం ద్రాబాద్‌ పరిధిలోని ఓటర్లు ట్రాఫిక్‌ సమస్యను మూడో ప్రయార్టీగా చెప్పారు.