- కొమ్మలు పక్కింట్లోకి రావడంతో రెండిళ్ల మధ్య ఘర్షణ
- కరోనా టైం నుంచి దేవుడి చెట్టుగా భావించి పూజలు
- కొమ్మలు కొట్టేయకపోవడంతో చెట్టుకు పక్కింటోళ్ల నిప్పు
- ప్రశ్నించిన యజమానిపై దాడి.. ఆపై హత్య
- అడ్డుకోబోయిన తండ్రిపైనా కొడుకుల దాడి
- తీవ్ర గాయాలతో ఆస్ప్రతికి తరలిస్తుండగా మృతి
- నిందితుల ఇంటిపై స్థానికుల దాడి.. ఎస్సైకి గాయాలు
- సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలంలో ఘటన
మేళ్లచెరువు, వెలుగు: రెండు ఇండ్ల మధ్య ఉన్న వేప చెట్టు విషయంలో తలెత్తిన గొడవ ఇద్దరి హత్యకు కారణమైంది. హత్యల విషయం తెలిసిన గ్రామస్తులు నిందితుడి ఇంటిపై దాడి చేసేందుకు ప్రయత్నించగా.. అడ్డుకోబోయిన ఎస్సై సైతం తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం ఎర్రగట్టు తండాలో శనివారం జరిగింది. స్థానికులు, పోలీసులు ప్రకారం.. ఎర్రగట్టు తండాకు చెందిన అమరబోయిన వెంకటేశ్వర్లు (74), భూక్యా సైదానాయక్ (65) పక్క పక్క ఇండ్లలో ఉంటున్నారు.
వెంకటేశ్వర్లు కరోనా సమయంలో తన ఇంట్లో ఓ వేప మొక్క నాటాడు. దానికి ముడుపు కట్టి పూజలు చేయడంతో తమ కుటుంబం కరోనా నుంచి బయటపడిందని నమ్మాడు. దాంతో గ్రామస్తులు సైతం పూజలు చేస్తూ, ముడుపులు కడుతున్నారు. చెట్టు పెరగడంతో వాటి కొమ్మలు పక్కనే ఉన్న సైదానాయక్ ఇంటి ఆవరణలోకి రావడం, ఆకులు రాలుతుండడంతో చెట్టును కొట్టేయాలని సైదానాయక్ కొన్ని రోజులుగా వెంకటేశ్వర్లను కోరుతున్నాడు.
పూజలు చేస్తున్న చెట్టును తాను కొట్టలేనని, అవసరమైతే మీ ఇంటి ఆవరణలోకి వచ్చిన కొమ్మలను మీరే కొట్టేసుకోండని చెప్తూ వస్తున్నాడు. ఈ విషయంలో ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ పంచాయితీ గతంలోనే పోలీస్ స్టేషన్ వరకు చేరింది. పోలీసులు ఇరు కుటుంబాలకు నచ్చజెప్పి పంపించారు. ఈ క్రమంలో సైదానాయక్ కొడుకులు రాంనాయక్, పెదబాబు కలిసి శనివారం వేపచెట్టును పూర్తిగా నరికేసి, పెట్రోల్ పోసి నిప్పంటించారు.
ఈక్రమంలో ఇరు కుటుంబాల మధ్య మాటామాట పెరగడంతో ఆగ్రహానికి గురైన రాంనాయక్, పెదబాబు కలిసి గొడ్డలితో వెంకటేశ్వర్లుపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ వెంకటేశ్వర్లు అక్కడికక్కడే చనిపోయాడు. అక్కడే ఉన్న నిందితుల తండ్రి సైదానాయక్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. అతడిపై సైతం కర్రతో దాడి చేశారు.
తీవ్రంగా గాయపడ్డ సైదా నాయక్ ను హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు. హత్య కేసు తమపైకి రాకుండా.. వెంకటేశ్వర్లు, సైదానాయక్ పరస్పరం కొట్టుకొని చనిపోయారని నమ్మించేందుకే.. రాంనాయక్, పెదబాబు కలిసి తమ తండ్రిని హత్య చేశారని తెలుస్తోంది. హత్యల విషయం తెలుసుకున్న ఎస్సై నవీన్ కుమార్ తన సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
మొదటి నుంచీ వివాదాస్పద కుటుంబమే..
సైదానాయక్ కుటుంబం మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉన్నట్లు తెలుస్తోంది. తమను కులం పేరుతో దూషిస్తున్నారంటూ సైదా నాయక్, అతడి కుమారులు గ్రామానికి చెందిన 33 మందిపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో 33 మందిపై కేసులు నమోదు కాగా ఇందులో మృతుడు వెంకటేశ్వర్లు కూడా ఉన్నాడు.
ఈ కేసుల్లో 13 మంది రిమాండ్కు కూడా వెళ్లి వచ్చారు. అప్పటి నుంచి గ్రామస్తులు సైదానాయక్ కుటుంబానికి దూరంగా ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీహత్యల విషయాన్ని తెలుసుకున్న సూర్యాపేట ఎస్పీ నర్సింహ ఎర్రగట్టుతండాకు చేరుకొని బాధిత కుటుంబాలు, ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడారు. హత్యకు కారణమైన వారికి కఠిన శిక్ష పడేలా చేస్తామని చెప్పారు.
నిందితుల ఇంటిపై గ్రామస్తుల దాడి, ఎస్సైకి గాయాలు
ఇద్దరి హత్య విషయం గ్రామస్తులకు తెలియడంతో ఆగ్రహానికి గురైన వారు సైదానాయక్ భార్య, ఇద్దరు కుమారులపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. గమనించిన వారు ఇంట్లోకి వెళ్లి దాక్కున్నారు. దీంతో గ్రామస్తులు మూకుమ్మడిగా రాళ్లు, కర్రలతో రాంనాయక్, పెదబాబు దాక్కున్న ఇంటిపైకి వెళ్లారు.
గ్రామస్తులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన మేళ్లచెరువు ఎస్సై నవీన్ కుమార్ కు రాళ్లు తగలడంతో తలకు గాయమైంది. అనంతరం సైదా నాయక్ భార్య, ఇద్దరు కుమారులను పోలీసులు అదుపులోకి తీసుకుని కోదాడ పీఎస్ కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.
