గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాకు హై ఫీవర్

గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాకు హై ఫీవర్

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన అథ్లెట్ నీరజ్ చోప్రా హై ఫీవర్, గొంతు నొప్పితో బాధపడుతున్నాడు. అయితే ఇటీవలే టోక్యో నుంచి రావడం, అనేక మందిని కలిసి ఉన్న నేపథ్యంలో అతడికి కరోనా టెస్ట్ చేశారు. టెస్టు రిపోర్ట్ నెగెటివ్ అనే వచ్చిందని నీరజ్ చోప్రా సన్నిహితులు మీడియాతో చెప్పారు. ప్రస్తుతం అతడు రెస్ట్ తీసుకుంటున్నాడని, కరోనా టెస్టులో నెగెటివ్ వచ్చినప్పటికీ అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నాడని తెలిపారు.

టోక్యో ఒలింపిక్స్‌ ముగిసే ముందు రోజు (గత శనివారం) జరిగిన జావెలిన్‌ త్రో ఫైనల్‌లో రికార్డు దూరానికి జావెలిన్ విసిరి భారత్ ఖాతాలో గోల్డ్ మెడల్ వేశాడు నీరజ్ చోప్రా. టోక్యో ఒలింపిక్స్‌లోనే భారత్ సాధించిన ఏకైక గోల్డ్ మెడల్ ఇదే కావడం విశేషం. అంతే కాదు వందేళ్ల ఒలింపిక్స్ చరిత్రలో అథ్లెటిక్స్ విభాగంలో భారత్ గెలుచుకున్న తొలి బంగారు పతకం కూడా ఇదే. నీరజ్ చోప్రా ఈ ఘనతను సాధించిన రోజును (ఆగస్టు 7) ఏటా ‘‘నేషనల్ జావెలిన్ త్రో డే’’గా జరుపుకోవాలని అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.