
- దోహా డైమండ్ లీగ్‌లో 90.23 మీటర్ల త్రో చేసి రికార్డు
- 91.06 మీటర్లతో వెబర్ టాప్ ప్లేస్
దోహా: ఇండియా స్టార్ జావెలిన్ త్రోయర్, ఒలింపిక్, వరల్డ్ చాంపియన్ నీరజ్ చోప్రా మరో ఘనత సాధించాడు. తన కెరీర్‌లో లోటుగా ఉన్న 90 మీటర్ల మార్కును ఎట్టకేలకు అందుకున్నాడు. శుక్రవారం రాత్రి జరిగిన దోహా డైమండ్ లీగ్ మీట్‌లో నీరజ్ జావెలిన్‌ను 90.23 మీటర్ల దూరం విసిరి ఔరా అనిపించాడు. దాంతో 90 మీటర్ల మార్కును అందుకోవాలన్న తన కలను ఇన్నాళ్లకు నెరవేర్చుకున్నాడు. ఈ క్రమంలో 2022 డైమండ్ లీగ్ స్టాక్‌హోమ్ లెగ్‌లో నెలకొల్పిన తన పర్సనల్ బెస్ట్ 89.94 మీటర్ల దూరాన్ని అధిగమించి సరికొత్త రికార్డు సృష్టించాడు. అయినప్పటికీ ఈ మీట్‌లో నీరజ్ రన్నరప్‌గా నిలిచాడు.
తన చివరి ప్రయత్నంలో జావెలిన్‌ను ఏకంగా 91.06 మీటర్ల దూరం విసిరిన జర్మనీ స్టార్ జులియన్ వెబర్ టాప్ ప్లేస్ సొంతం చేసుకున్నాడు. ఉత్కంఠగా సాగిన ఈ మీట్‌లో తొలి ప్రయత్నంలో 88.44 మీటర్ల దూరం విసిరిన చోప్రా.. రెండో ప్రయత్నంలో ఫౌల్ చేశాడు. కానీ, మూడోసారి 90 మీటర్ల మార్కును క్రాస్ చేశాడు. తర్వాత 80.56 మీటర్లు విసిరి ఐదోసారి ఫౌల్ చేసినప్పటికీ చోప్రా టాప్‌లోనే కొనసాగాడు. కానీ, మూడో అటెంప్ట్‌లో 89.06 మీటర్లతో నిలిచిన వెబర్ ఐదోసారి 89.84 మీ. చివరి, ఆరో ప్రయత్నంలో అనూహ్యంగా 91 మీటర్లు దాటి టాప్ ప్లేస్‌లో నిలిచాడు.
నీరజ్ చివరి ప్రయత్నంలో 88.20 మీటర్లతో సరిపెట్టాడు. గ్రెనెడాకు చెందిన అండర్సన్ పీటర్స్ 85.64 మీటర్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఇండియాకు చెందిన కిశోర్ జెనా.. రెండో ప్రయత్నంలో అత్యధికంగా 78.60 మీటర్లతో ఎనిమిదో స్థానంతో సరిపెట్టాడు. కాగా, జావెలిన్ త్రోలో 90 మీటర్లను అత్యంత ప్రతిష్టాత్మకమైన మైలురాయిగా భావిస్తారు. జావెలిన్ చరిత్రలో ఇది వరకు 24 మంది మాత్రమే ఈ మార్కు అందుకోగా.. నీరజ్ 25వ అథ్లెట్‌గా నిలిచాడు.
అర్షద్ నదీమ్ (పాకిస్తాన్ 92.97), చవో సున్ సెంగ్ (చైనీస్ తైపీ 91.36) తర్వాత ఈ ఘనత సాధించిన మూడో ఆసియా అథ్లెట్‌గా నిలిచాడు. కాగా, విమెన్స్ 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో 9:13:39 టైమింగ్‌తో ఆరో స్థానంలో నిలిచిన పరుల్ చౌదరి వరల్డ్ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది.