నీట్, జేఈఈ ప్రవేశాల్లో బోర్డు మార్కులకు 50 శాతం వెయిటేజీ?: కేంద్ర ప్రభుత్వం యోచన

నీట్, జేఈఈ ప్రవేశాల్లో బోర్డు మార్కులకు 50 శాతం  వెయిటేజీ?: కేంద్ర ప్రభుత్వం యోచన
  • స్టూడెంట్లపై పరీక్షల ఒత్తిడి తగ్గించేందుకు నిర్ణయం
  • స్కూల్ సిలబస్‌‌‌‌ నుంచే ఎంట్రెన్స్​ఎగ్జామ్స్ ​ప్రశ్నలు ఇచ్చే ఆలోచన 
  • ఇటీవల పేపర్ లీకేజీలు, మూల్యాంకనంలో లోపాలపై దేశవ్యాప్తంగా చర్చ

న్యూఢిల్లీ: దేశంలో వైద్య, ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్, జేఈఈ వంటి ప్రవేశ పరీక్షల విధానంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ప్రస్తుతం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ స్కోర్ ఆధారంగానే జరుగుతున్న అడ్మిషన్లలో, ఇకపై ఇంటర్/ప్లస్ టూ మార్కులకు 50 శాతం వెయిటేజీ కల్పించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఒకే ఒక్క పరీక్షపైనే విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉండేలా కాకుండా, పరీక్షల ఒత్తిడిని తగ్గించాలనే ఉద్దేశంతో ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. 

ఇటీవలి కాలంలో పరీక్షల నిర్వహణలో పేపర్ లీకేజీలు, మూల్యాంకనంలో లోపాలు వంటి వివాదాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. వ్యవస్థ పట్ల నమ్మకాన్ని పెంచేందుకు విద్యా మంత్రిత్వ శాఖ గతేడాది 9 మంది సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. కోచింగ్ సెంటర్లపై విద్యార్థులు ఆధారపడటాన్ని తగ్గించడం, ప్రవేశ పరీక్షల్లో పారదర్శకతను తీసుకురావడమే లక్ష్యంగా ఈ కమిటీ పనిచేస్తోంది. 

అంతేకాకుండా, విద్యార్థులు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాలను స్కూల్ సిలబస్‌‌కు అనుగుణంగా మార్చడంపై ఆలోచన చేస్తున్నారు. అడాప్టివ్ ఆన్-డిమాండ్ కంప్యూటర్ ఆధారిత పరీక్షల వైపు మళ్లడం వంటి మార్పులను కూడా పరిశీలిస్తున్నారు.

కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ తన తుది నివేదికను రాబోయే కొన్ని వారాల్లోనే ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా స్కూల్ సిలబస్‌‌కు, ఎంట్రన్స్ పరీక్షలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించడమే ఈ కమిటీ ప్రధాన అజెండాగా కనిపిస్తోంది.