నీట్ పరీక్ష వాయిదాకు నో చెప్పిన సుప్రీంకోర్టు

నీట్ పరీక్ష వాయిదాకు నో చెప్పిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: ఈనెల 12న జరగాల్సిన నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (నీట్‌-2021) వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మెడికల్ అండర్ గ్రాడ్యుయేట్‌ కోర్సుల కోసం నిర్వహించే ఈ పరీక్షలను వాయిదా వేయాలంటూ వేసిన పిటీషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఇతర ఎంట్రెన్స్‌ పరీక్షలు ఒకవైపు జరుగుతుండగా, అదే సమయంలో నీట్‌ పరీక్షలు నిర్వహించడాన్ని సవాలు చేస్తూ పిటిషన్‌ దాఖలైంది. సీబీఎస్‌ఈ ఇంప్రూవ్‌మెంట్‌, కంపార్టుమెంటల్ పరీక్షలు కూడా జరుగుతున్నాయి. 
ఈనెల 6న ఇంటర్మీడియట్ బయాలజీ, 9న ఫిజిక్స్‌ పరీక్షలు ఉన్నాయని.. ఆ వెంటనే 12న నీట్‌ పరీక్షలు నిర్వహించకుండా వాయిదా వేయాలని పిటీషనర్‌ సుప్రీంకోర్టును అభ్యర్థించారు. వాదనలు విన్న జస్టిస్‌ ఖన్‌విల్కర్‌ నేతృత్వంలోని బెంచ్‌ పిటీషనర్ వినతిని తోసిపుచ్చింది. ఒకవేళ పలు పరీక్షలు ఉండే పక్షంలో... ఏ పరీక్షకు హాజరు కావాలో నిర్ణయించుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.