
- 30 నుంచి స్టేట్ కోటా కౌన్సెలింగ్
- సెప్టెంబరు 1 నుంచి తరగతులు
హైదరాబాద్, వెలుగు: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) అండర్ గ్రాడ్యుయేట్ 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఆలిండియా, డీమ్డ్, సెంట్రల్, స్టేట్ కోటా సీట్ల కోసం కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) శనివారం ప్రకటించింది. నీట్ 2025లో అర్హత సాధించిన విద్యార్థులందరూ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఎంసీసీ సూచించింది. మొదట ఆలిండియా కోటా కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. తర్వాత స్టేట్ కోటా సీట్ల కౌన్సెలింగ్ కోసం కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. రాష్ట్రంలో 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 4,090 ఎంబీబీఎస్ సీట్లు, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 4,500 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి.
మొత్తం మూడు రౌండ్లలో కౌన్సెలింగ్ జరగనుంది. ఈ రౌండ్లలో భర్తీకాని సీట్లను స్ట్రే వేకెన్సీ రౌండ్ ద్వారా భర్తీ చేస్తారు. కౌన్సెలింగ్‌కు సమయం తక్కువగా ఉన్నందున శని, ఆదివారాలు, గెజిటెడ్ సెలవు రోజుల్లో కూడా కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగించాలని ఎంసీసీ సూచించింది. కౌన్సెలింగ్ తర్వాత సెప్టెంబరు 1 నుంచి వైద్యవిద్య తరగతులు ప్రారంభం కానున్నాయి. ఆలిండియా, డీమ్డ్, సెంట్రల్ యూనివర్సిటీలతోపాటు రాష్ట్రాల్లోని మెడికల్ కాలేజీల్లో 15 శాతం సీట్ల భర్తీ కోసం కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. మొదటి రౌండ్ రిజిస్ట్రేషన్ ఈ నెల 21 నుంచి 30 వరకు, రెండో రౌండ్ కౌన్సెలింగ్ ఆగస్టు 12 నుంచి 20 వరకు, మూడో రౌండ్ సెప్టెంబరు 3 నుంచి 10 వరకు, స్ట్రే వేకెన్సీ రౌండ్ సెప్టెంబరు 26తో ఆలిండియా కౌన్సెలింగ్ ముగుస్తుంది.
30 నుంచి స్టేట్ కోటా కౌన్సెలింగ్
స్టేట్ కోటా సీట్ల భర్తీ కోసం ఈ నెల 30 నుంచి అక్టోబరు 3 వరకు కౌన్సెలింగ్ నిర్వహించాలని స్టేట్ యూనివర్సిటీలకు ఎంసీసీ సూచించింది. అయితే, స్టేట్ హెల్త్ యూనివర్సిటీలు ఎంసీసీ నిర్ణయించిన తేదీలకు అనుగుణంగా లేదా కొంత మార్పుతో నోటిఫికేషన్ విడుదల చేస్తాయి. తెలంగాణలో సుమారు 8,500 స్టేట్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఎంసీసీ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 30 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అక్టోబరు 3 నాటికి స్ట్రే వేకెన్సీ రౌండ్‌తో స్టేట్ కోటా సీట్లభర్తీ పూర్తవుతుంది.