అర్హత, అనుభవం లేని ఉద్యోగుల చేతుల్లో ఎంఎల్​ఎస్​ పాయింట్లు

అర్హత, అనుభవం లేని ఉద్యోగుల చేతుల్లో ఎంఎల్​ఎస్​ పాయింట్లు
  • నిరుడు మంచిర్యాల గోదాం నుంచి భారీగా రైస్​ పక్కదారి 
  • తిరిగి ఆ ఉద్యోగికే బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్ధం 

మంచిర్యాల, వెలుగు: జిల్లాలో రేషన్​ బియ్యం గోదాముల నిర్వహణపై అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు. మండల్​ లెవల్​ స్టాక్​​ (ఎంఎల్​ఎస్​) పాయింట్లను​ అర్హత, అనుభవం లేని ఉద్యోగుల​ చేతుల్లో పెట్టి చోద్యం చూస్తున్నారు. దీంతో ప్రతి నెలా ఎంఎల్​ఎస్​ పాయింట్ల నుంచి రేషన్ షాపులకు మూమెంట్​ లేట్​ అవుతోంది. ఫలితంగా బియ్యం పంపిణీలో ఆలస్యం జరుగుతోంది.

అనుభవం లేక అవస్థలు....  

మంచిర్యాల, చెన్నూర్​, లక్సెట్టిపేట, బెల్లంపల్లి, కోటపల్లి, తాండూర్​లో ఎంఎల్​ఎస్​ పాయింట్లు ఉన్నాయి. ఇక్కడినుంచే 423 రేషన్​ షాపులకు బియ్యం సప్లై అవుతున్నాయి. ఎంఎల్​ఎస్​ పాయింట్లకు డిప్యూటీ తహసీల్దార్​ (డీటీ) స్థాయి అధికారులను ఇన్​చార్జిలుగా నియమించాలి. వారు లేకుంటే సివిల్​ సప్లై కార్పొరేషన్​ పరిధిలోని డీఎం ఆఫీసు సిబ్బందిని కేటాయించాలి. కానీ జిల్లాలో స్టాఫ్​ కొరత సాకుతో రెవెన్యూ డిపార్ట్​మెంట్​కు చెందిన సీనియర్​ అసిస్టెంట్లకు ఎంఎల్​ఎస్​ పాయింట్లను అప్పగించారు. మంచిర్యాల మినహా మిగతా ఐదింటికి సీనియర్​ అసిస్టెంట్లే బాధ్యులుగా ఉన్నారు. ఇందులో చెన్నూర్​, కోట్లపలి ఒకరికి, బెల్లంపల్లి, తాండూర్​ మరొకరికి అప్పగించారు. వీరికి గోదాముల నిర్వహణ, మూమెంట్​పై అనుభవం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి నెలా రేషన్​ మూమెంట్​ లేట్ కావడంతో  పంపిణీలో ఆలస్యమవుతోంది.  

ఔట్ సోర్సింగ్​ ఎంప్లాయ్​ చేతిలో... 

మంచిర్యాల ఎంఎల్​ఎస్​ పాయింట్​ నిర్వహణను అధికారులు గాలికి వదిలేశారు. ఇదివరకు అగ్రికల్చర్​ మార్కెట్​ యార్డ్​లో ఎంఎల్​ఎస్​ పాయింట్​ ఉండేది. ఈ గోదాములను నిరుడు మెడికల్​ కాలేజీకి కేటాయించడంతో వేంపల్లిలోని ప్రైవేట్​ గోదాంలోకి తరలించారు. అక్కడ స్థలం చాలడం లేదని నస్పూర్​ మండలం తీగల్​పహాడ్​లోని ప్రైవేట్​ గోడౌన్లలోకి మార్చారు. దానికి రెవెన్యూ డిపార్ట్​మెంట్​కు చెందిన సీనియర్​ ఉద్యోగిని ఇన్​చార్జిగా నియమించారు. ఆయన అనారోగ్యంతో లీవ్​ పెట్టి, ఆ తర్వాత  బెల్లంపల్లి తహసీల్దార్​కు వెళ్లిపోయాడు. దీంతో ఎంఎల్​ఎస్​ పాయింట్​ను డీఎం ఆఫీసులో పనిచేసే ఔట్​ సోర్సింగ్​ ఎంప్లాయ్​కు అప్పగించారు. శాఖలో సీనియర్​ ఉద్యోగులు ఉన్నప్పటికీ నాలుగు నెలలుగా ఏమాత్రం అనుభవం లేని ఔట్​ సోర్సింగ్​ ఎంప్లాయ్​తోనే నడిపిస్తున్నారు. గతంలో అక్రమాలకు పాల్పడిన ఉద్యోగికే మళ్లీ ఇన్​చార్జి బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం.  

అక్రమాలు జరిగితే బాధ్యులెవరు..? 

ఎంఎల్​ఎస్​ పాయింట్లలో కనీస నిబంధనలను కూడా పాటించడం లేదు. చాలా చోట్ల సీసీ కెమెరాలు లేవు. తీగల్​పహాడ్​లోని గోదాముల్లో కరెంట్​, తాగునీళ్లు కూడా లేవు. నిరుడు మంచిర్యాల ఎంఎల్​ఎస్​ పాయింట్​ నుంచి సుమారు 800 క్వింటాళ్ల బియ్యం మాయమయ్యాయి. హైదరాబాద్​ నుంచి విజిలెన్స్​ ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు వచ్చి లెక్కతేల్చేంత వరకు జిల్లా ఆఫీసర్లు పట్టించుకోలేదు. ఈ వ్యవహారంలో కొంతమంది అధికారుల పాత్రపై ఆరోపణలు వచ్చినప్పటికీ ఇన్​చార్జిని బాధ్యుడిగా తేల్చి సస్పెండ్​  చేశారు. మంచిర్యాల ఎంఎల్​ఎస్​ పాయింట్​ పరిధిలో 140 రేషన్​ షాపులు ఉన్నాయి. రేషన్​ బియ్యంతో పాటు హాస్టళ్లకు సంబంధించిన సన్నబియ్యం, సీజ్డ్​ రైస్​ భారీ మొత్తంలో స్టాక్​ ఉంటాయి. కోట్ల విలువైన వేల క్వింటాళ్ల బియ్యాన్ని ఒక ఔట్​ సోర్సింగ్​ ఎంప్లాయ్​ చేతిలో పెట్టడంతో అక్రమాలు జరిగితే బాధ్యులెవరు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

తూకం లేకుండానే సప్లై... 

నిబంధనల ప్రకారం ఎంఎల్​ఎస్​ పాయింట్ల నుంచి రేషన్​ షాపులకు బియ్యం తూకం వేసి సప్లై చేయాల్సి ఉండగా అవేమీ పట్టించుకోవడం లేదు. స్టేజ్​1 గోదాముల నుంచి ఎంఎల్​ఎస్​ పాయింట్లకు వచ్చిన బియ్యాన్ని కాంటా వేసి గోదాముల్లో నిల్వ చేయాలి. మళ్లీ తూకం వేసి రేషన్​ షాపులకు సప్లై చేయాలి. కానీ స్టేజ్​1 గోదాముల నుంచి లారీల్లో వచ్చిన బియ్యం బస్తాలను ఎంఎల్​ఎస్​ పాయింట్​వద్ద మరో లారీలోకి మార్చి నేరుగా రేషన్​ షాపులకు రవాణా చేస్తున్నారు. ట్రాన్స్​పోర్ట్​ చేసేటప్పుడు పాత, చిరిగిన సంచుల్లో నుంచి బియ్యం కారిపోతున్నాయి. దీంతో 50 కిలోల బ్యాగులో 45 కిలోలకు కొంచెం అటూ ఇటుగా వస్తున్నాయని, ఒక్కో బస్తాకు నాలుగైదు కిలోలు తరుగుపోతున్నాయని డీలర్లు చెప్తున్నారు. అంతేగాకుండా ఎంఎల్​ఎస్​ పాయింట్​ వద్ద బియ్యం బస్తాలను కాంటా వేయకున్నా వేసినట్టు బోగస్​ బిల్లులు పెట్టి హమాలీ చార్జీలను మింగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.