హైదరాబాద్, వెలుగు: డోనియర్ గ్రూపునకు చెందిన ప్రీమియం మెన్స్‌వేర్ బ్రాండ్ నియోస్ట్రెచ్ తమ వ్యాపారాన్ని భారీగా విస్తరించానికి రెడీ అయింది. రాబోయే ఐదేళ్లలో 300 స్టోర్లను తెరుస్తామని, తొలి ఏడాదే 10 స్టోర్లను ఓపెన్ చేస్తామని ప్రకటించింది. రెండో ఏడాది ముగిసే నాటికి వీటి సంఖ్య 50కి చేరుతుందని సంస్థ ఫౌండర్ రిషి అగర్వాల్ చెప్పారు.
హైదరాబాద్లో స్టోర్ ప్రారంభం సందర్భంగా ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే మార్చి నాటికి హైదరాబాద్‌లో నాలుగు స్టోర్లను తెరుస్తామని ప్రకటించారు. ‘‘ఏడాదికి ఒక్కో స్టోర్‌నుంచి రూ.3.5 కోట్ల వరకు ఆదాయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రతి స్టోర్‌కు పెట్టుబడి సుమారు రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు అవుతోంది. సౌకర్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంచే స్ట్రెచ్ దుస్తులను తక్కువ ధరకే అందించడం బ్రాండ్ ప్రత్యేకత.
మాకు గుంటూరు, సూరత్, సిల్వాసా వంటి ప్రాంతాలలో మిల్స్ ఉన్నాయి. భవిష్యత్తులో మహిళల దుస్తులనూ అమ్ముతాం. రాబోయే ఐదేళ్లలో ఈ–-కామర్స్ ద్వారా రూ.200 కోట్ల వరకు వస్తాయన్నది మా అంచనా”అని రిషి అగర్వాల్ వివరించారు.

