
జనరేషన్ జెడ్ నిరసనకారుల ఆందోళనలు నేపాల్ లో ప్రధాని కేపీ శర్మ ప్రభుత్వాన్ని కూలదోశాయి. దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగిసిపడిన ఆగ్రహజ్వాలలు ప్రధానితో సహా కేంద్ర మంత్రులందరూ రాజీనామా చేసి పారిపోయేలా చేశాయి. నేపాల్ ప్రస్తుతం ఆర్మీ గుప్పిట్లో ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు సైనిక పాలన సాగుతుంది. ప్రధానిగా తన పదవికి కేపీ శర్మ రాజీనామా చేసిన తర్వాత ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఎవరు సమర్థవంతంగా నేపాల్ ను పాలించగలరు అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
ఈ క్రమంలో ఇద్దరి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. నిన్న బాలెన్ షా పేరు తెరపైకి రాగా.. ఇవాళ నేపాల్ మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కీ పేరు తెరపైకి వచ్చింది.. నిరసనకారులతో జరిపిన చర్చల్లో ఆమెకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది.. ఆ దేశ మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కి హిమాలయ దేశంలో తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించేందుకు ఎంపికైనట్లు సమాచారం.
ప్రస్తుతం నేపాల్ ఆర్మీ చేతిలోకి వెళ్లింది. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు, శాంతిని పునరుద్దరించేందుకు నిరసనకారులతో బుధవారం (సెప్టెంబర్ 10) చర్చలు జరిగాయి.4వేలకు పైగా యువకులు ఆన్ లైన్ లో సమావేశం అయినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. ఈ సమావేశంలో సుశీలా కర్కి పేరును సైన్యంతో చర్చలు జరిపేందుకు, తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నాయకత్వం వహించేందుకు ఆందోళనకారులు అంగీకరించారు.
►ALSO READ | ఫ్రాన్స్‌లో చెలరేగిన అల్లర్లు..అట్టుడికిన వీధులు..బస్సులకు నిప్పుపెట్టిన ఆందోళనకారులు
వర్చువల్ సమావేశంలో సుశీలా కర్కి 31 శాతం ఓట్లు పొందగా, ఖాట్మండు మేయర్ బాలెన్ షా 27 శాతం ఓట్లు పొందారు. దీనితో ఇప్పటివరకు జనరేషన్ జెడ్ ఉద్యమ నాయకుడిగా ప్రచారంలో ఉన్న షా కంటే సుశీల కర్కీకి ఆందోళనకారులు ఎక్కువ మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది.
సుశీల కర్కీ ఎవరు..?
సుశీలా కర్కి.. నేపాల్ సుప్రీంకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి.. 1952లో మొరాంగ్జిల్లా బీరత్ నగర్ లో జన్మించారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి పొలిటికల్ సైన్స్ మాస్టర్ డిగ్రీ, నేపాల్లోని త్రిభువన్ యూనివర్సిటీనుంచి లా డిగ్రీ పొందారు.
2016లో సుశీలా కర్కీ నేపాల్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా పనిచేశారు. అవినీతికి వ్యతిరేకంగా అనేక తీర్పులు ఇచ్చారు. పోలీసు నియామకాల్లో అక్రమాలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు ,అనేక ప్రముఖ అవినీతి కేసులపై ఆమె తీసుకున్న నిర్ణయాలకు ప్రసిద్ధి చెందారు.
అయితే 2017లో రాజకీయ పార్టీలు ఆమెపై అభిశంసన తీర్మానాన్ని తీసుకువచ్చాయి. ఆమె పక్షపాతంతో కార్యనిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించాయి. ఆమెకు అనుకూలంగా భారీ ప్రజా మద్దతు ,సుప్రీంకోర్టు ఆదేశంతో ఆ తీర్మానాన్ని ఉపసంహరించుకున్నారు.