విమాన ప్రమాదంలో 72 మంది సజీవదహనం

విమాన ప్రమాదంలో 72 మంది సజీవదహనం

నేపాల్ విమాన ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న 72 మంది మృత్యువాతపడ్డారు. 68 మంది ప్యాసింజర్లతో పాటు నలుగురు విమాన సిబ్బంది సజీవ దహనమయ్యారు. విమానం కూలిన తర్వాత భారీగా మంటలు చెలరేగడంతో దాదాపు విమానంలోని వారంతా మరణించినట్లు తెలుస్తోంది. మృతుల్లో ఐదుగురు భారతీయులు, మరో 10 మంది విదేశీయులు ఉన్నట్లు సమాచారం. ఖాట్మాండు నుంచి పోఖారా ఎయిర్ పోర్టుకు వస్తున్న యతి ఎయిర్ లైన్స్ చెందిన ఏటీఆర్ 72 విమానం ల్యాండింగ్ కు 5 నిమిషాల ముందు కుప్పకూలింది.

సహాయక సిబ్బంది ఇప్పటి వరకు 30 మంది మృతదేహాలను బయటకు తీశారు. మిగిలిన మృతదేహాలను వెలికితీస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో విమానానికి చెందిన ఒక్క రెక్క తప్ప మొత్తం విమానం కాలిబూడిదైంది. ఘటనా స్థలంలో మంటలు ఎగిసిపడుతుండటంతో మృతదేహాలు వెలికితీత ఆలస్యమవుతోంది. మృతదేహాలను గుర్తించడం కూడా సాధ్యం కాకపోవచ్చని అధికారులు చెబుతున్నారు. విమాన ప్రమాదంపై నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అత్యవసర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి.. భద్రతా దళాలు, హోంశాఖ వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అయితే విమాన ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.