వివాదాస్పద కొత్త మ్యాప్‌ను ఆమోదించిన నేపాల్ పార్లమెంట్

వివాదాస్పద కొత్త మ్యాప్‌ను ఆమోదించిన నేపాల్ పార్లమెంట్

న్యూఢిల్లీ: నేపాల్ ఎగువ సభ గురువారం తమ జాతీయ చిహ్నంలో వివాదాస్పద కొత్త మ్యాప్‌ను ప్రతిబింబించేలా రాజ్యాంగ సవరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. దీని వల్ల ఇండియా–నేపాల్ సంబంధాల్లో చిక్కులు వస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ బిల్లుకు మద్దతుగా 57 ఓట్లు రాగా.. వ్యతిరేకంగా ఒక్క ఓటూ రాకపోవడం గమనార్హం. గత వారంలో నేపాల్ దిగువ సభలో ఈ బిల్లుకు మద్దతుగా 258 మంది సభ్యులు ఓట్లు వేశారు. లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురా భూభాగాలు తన సొంతమని నేపాల్ అంటోన్న సంగతి తెలిసిందే. గత నెలలో కొత్త పటం విడుదలకు ముందుకు సాగిన నేపాల్ ప్రధాని కేపీ ఓలి శర్మ.. ఇండియా అధీనంలో ఉన్న తమ భూభాగాలను తిరిగి సొంతం చేసుకుంటామని పదే పదే చెప్పిన విషయం విధితమే. గత వారం నేపాల్ పార్లమెంట్‌లో ఆ దేశ విదేశాంగ మంత్రి ప్రదీప్ గ్యవాలి మాట్లాడుతూ.. లిపులేఖ్‌కు కొత్త రోడ్‌ వేయడం తమ సార్వభౌమత్వాన్ని బలహీనపర్చిందన్నారు. నేపాల్ సరిహద్దు కాళీ నది మూలం అయిన లింపియాధురా వద్ద ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు. అలాగే ఇండియాతో సరిహద్దు1816 సుగౌలీ ఒప్పందం ద్వారా నిర్ణయించబడుతుందని స్పష్టం చేశారు.