రైతు బీమా తరహాలోనే నేతన్న బీమా

రైతు బీమా తరహాలోనే నేతన్న బీమా

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: చేనేత కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈనెల ఏడో తేదీ నుంచి నేతన్న బీమా పథకం అమల్లోకి తీసుకొస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌‌‌‌ తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు. నేతన్న బీమా పథకం అమలుపై సోమవారం ప్రగతి భవన్‌‌‌‌లో అధికారులతో ఆయన సమీక్షించారు. రైతుబీమా తరహాలోనే ఈ పథకం లబ్ధిదారులు దురదృష్టవశాత్తు మృతి చెందితే 10 రోజుల్లోనే రూ.5 లక్షల బీమా మొత్తం అందజేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 80 వేల మంది నేత కార్మికులకు లబ్ధి చేకూరుతుందన్నారు. చేనేత, మరమగ్గాల కార్మికులు ఈ బీమా పథకానికి అర్హులని తెలిపారు. బీమా అమలు కోసం ఎల్‌‌‌‌ఐసీతో ప్రభుత్వం అగ్రిమెంట్‌‌‌‌ చేసుకుందని వెల్లడించారు. కార్మికులు రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని, మొత్తం ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. ఇందుకోసం రూ.25 కోట్లు విడుదల చేసినట్లు వివరించారు. 60 ఏళ్లలోపు చేనేత, పవర్‌‌‌‌లూమ్‌‌‌‌ కార్మికులంతా ఈ పథకం కింద లబ్ధి పొందడానికి అర్హులన్నారు. బీమా అమలుకు రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

రూ.29 కోట్ల లోన్లు మాఫీ చేసినం

చేనేత, జౌళి శాఖకు ఇచ్చే బడ్జెట్‌‌‌‌కు అదనంగా 2016 –17 ఆర్థిక సంవత్సరం నుంచి ఏటా బడ్జెట్‌‌‌‌లో రూ.1,200 కోట్లు కేటాయిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. చేనేత మిత్ర స్కీంలో భాగంగా 10,148 మంది కార్మికులకు సంబంధించిన రూ.28.97 కోట్ల లోన్లు మాఫీ చేశామన్నారు.  దేశంలో జాతీయ జెండాలను తయారు చేసుకోలేని పరిస్థితి కల్పించారని, వాటినీ చైనా నుంచే దిగుమతి చేస్తున్నారని కేంద్రంపై కేటీఆర్ మండిపడ్డారు. దేశంలో ఖాదీ ఇండస్ట్రీ జాతీయ జెండాలు తయారు చేయగలిగే పరిస్థితుల్లో లేదని కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌ రెడ్డి కామెంట్​పై  ఫైర్ అయ్యారు.