
జెరూసలెం/గాజా: ఇకపై హమాస్ ఉండదని, త్వరలోనే దానిని తుడిచిపెట్టేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అన్నారు. గాజాలో 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ అంగీకరించిందని, పరిస్థితులు మరింత దిగజారకముందే హమాస్ కూడా అంగీకరించాలని మంగళవారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించిన అనంతరం నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేశారు.
“ఇకపై హమాస్ ఉండదు. అంతా అయిపోయింది. మేం మా బందీలందరినీ విడిపిస్తాం. హమాస్‌ను పునాదుల నుంచి పెకిలిస్తాం” అని ప్రకటించారు. కాగా, గాజా నుంచి ఇజ్రాయెల్ సైన్యాన్ని ఉపసంహరించుకుని యుద్ధాన్ని ముగిస్తే తాము ఒప్పందం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని హమాస్ ప్రకటించింది. కానీ, హమాస్ లొంగిపోయి, ఆయుధాలను అప్పగించి, గాజా నుంచి వెళ్లిపోవడానికి అంగీకరిస్తేనే యుద్ధాన్ని ఆపుతామని ఇజ్రాయెల్ చెబుతోంది.
గాజాలో 94 మంది పాలస్తీనియన్లు మృతి ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు గాజాలో 94 మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా హెల్త్ మినిస్ట్రీ గురువారం తెలిపింది. ఈ దాడులు గాజా స్ట్రిప్‌లోని వివిధ ప్రాంతాలలో జరిగాయి. ఇందులో రఫా, ఖాన్ యూనిస్, గాజా సిటీ షిఫా హాస్పిటల్ సమీపంలోని ప్రాంతాలు ఉన్నాయి. అయితే జీహెచ్ఎఫ్ క్యాంపు వద్ద జరిగిన కాల్పుల ఘటనలో 27 మంది మరణించారని మీడియా పేర్కొంది.