ఏ దేశ భూభాగాన్ని ఇంచు కూడా ఆక్రమించలేదు: హువా చునైంగ్

ఏ దేశ భూభాగాన్ని ఇంచు కూడా ఆక్రమించలేదు: హువా చునైంగ్

ఇతర దేశాలతో తాము ఎప్పుడూ శాంతిసామరస్యాలను మాత్రమే కోరుకుంటామని తెలిపారు చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి హువా చునైంగ్.  అంతేకాదు ఏ దేశాన్ని కూడా యుద్ధం దిశగా తాము రెచ్చగొట్టలేదని… ఏ దేశానికి చెందిన ఇంచు భూభాగాన్ని కూడా ఆక్రమించలేదని స్పష్టం చేశారు. సరిహద్దులను దాటి తమ బలగాలు ఏ దేశంలోకి చొచ్చుకుపోలేదని అన్నారు. వాస్తవాధీనరేఖ  దగ్గర చైనా, భారత్ ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న క్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

ద్వైపాక్షిక సంబంధాలను దృష్టిలో ఉంచుకుని ఇరు దేశాలు సంయమనం పాటించాలని చునైంగ్ తెలిపారు. సరిహద్దులో శాంతి నెలకొల్పేందుకు యత్నించాలని చెప్పారు. లడఖ్ సరిహద్దుల్లో చైనా బలగాలను భారత సైన్యం నిలువరించిన రెండు రోజుల తర్వాత ఆమె ఈ విధంగా స్పందించారు. తమ సార్వభౌమత్వానికి విఘాతం కలిగించేలా భారత్ వ్యవహరిస్తోందని చెప్పారు. పరిస్థితి మరింత దిగజారేలా భారత్ వ్యవహరించకూడదని కోరారు.