కరోనా పరిహారం కోసం ఫేక్ డెత్ సర్టిఫికెట్లు..సుప్రీం సీరియస్

కరోనా పరిహారం కోసం ఫేక్ డెత్ సర్టిఫికెట్లు..సుప్రీం సీరియస్

న్యూఢిల్లీ: కరోనాతో చనిపోయిన వారికి అందిస్తున్న రూ.50 వేల నష్టపరిహారం కోసం.. కొందరు నకిలీ డెత్ సర్టిఫికెట్లు ఇస్తుండటంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. బాధితులకు ఉద్దేశించిన స్కీమ్‌‌ను దుర్వినియోగం చేస్తారని తాము ఊహించలేదని, నైతికత ఇంతలా దిగజారి పోయిందని అనుకోలేదని కామెంట్ చేసింది. ఈ అంశంపై విచారణను అకౌంటెంట్ జనరల్ ఆఫీసుకు అప్పగించవచ్చని జస్టిస్ ఎంఆర్ షా, బీవీ నాగరత్నతో కూడిన బెంచ్ సోమవారం చెప్పింది. నష్టపరిహారం కోసం నకిలీ కరోనా డెత్ సర్టిఫికెట్లను జారీ చేయడంపై గతంలోనే ఆందోళన వ్యక్తంచేసిన బెంచ్.. ఈ సమస్యపై విచారణకు ఆదేశించవచ్చని చెప్పింది. ఈ నకిలీ సర్టిఫికెట్ల విషయంలో కొంతమంది అధికారులు ప్రమేయం ఉన్నట్లు తేలితే అది చాలా తీవ్రమైన విషయమని తెలిపింది. ఎక్స్‌‌గ్రేషియా చెల్లింపు ప్రక్రియను సులభతరం చేసేందుకు స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ (ఎస్‌‌ఎల్‌‌ఎస్‌‌ఏ) సభ్య కార్యదర్శితో సమన్వయం చేసుకోవడానికి ప్రత్యేక నోడల్ ఆఫీసర్‌‌‌‌ను నియమించాలని సుప్రీంకోర్టు ఇదివరకే ఆదేశించింది. 

టైమ్ ఫ్రేమ్ విధించండి: తుషార్ మెహతా

సోమవారం విచారణ సందర్భంగా కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. దరఖాస్తులు చేసుకునేందుకు కాలపరిమితిని నిర్ణయించడాన్ని సుప్రీం పరిగణించవచ్చని చెప్పారు. తద్వారా అర్హులు నిర్ణీత సమయంలోగా అప్లై చేసుకుంటారని తెలిపారు. జోక్యం చేసుకున్న బెంచ్.. ‘ఈ విషయంలో సరైన అప్లికేషన్‌‌ను ఫైల్ చేయమని మీకు గతంలోనే చెప్పాం. అందుకే విచారణను వాయిదా వేసింది” అని చెప్పింది.